
– రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం
– మెజార్టీ సీట్లు సాధించిన పార్టీకే అధికారం దక్కే ఛాన్స్
– గత నాలుగు ఎన్నికల్లోను కొనసాగిన ఇదే ఒరవడి
Uttarandhra Politics: ఉమ్మడి రాష్ట్రంలో గాని విభజిత రాష్ట్రంలో గాని ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాజకీయంగా ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రాంతంలో పట్టు సాధించిన రాజకీయ పార్టీలు మాత్రమే రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటూ వస్తున్నాయి. గత నాలుగు ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఇదే నిజమని అర్థమవుతుంది. 2004 నుంచి తాజాగా జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల వరకు ఇదే నిరూపితమైంది. ఇక్కడ మెజార్టీ సీట్లు సాధించే పార్టీలే ఆ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకుంటాయి.
వచ్చే ఎన్నికల్లోను ఇదే వరవడి కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. 2004 2009 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండడంతో అధికారంలోకి వచ్చింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండుసార్లు ముఖ్యమంత్రి కావడంలో ఈ ప్రాంతానికి కీలకపాత్ర. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర తరువాత ఎదుర్కొన్న మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఇకపోతే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం పై తెలుగుదేశం పార్టీ సంపూర్ణ ఆధిపత్యాన్ని చలాయించడంతో చంద్రబాబు అధికారాన్ని కైవశం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసిపి అధిక స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వచ్చింది.
ఆ పార్టీలకే మెజారిటీ సీట్లు..
ఆయా ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను చూస్తే ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యధిక సీట్లు గెల్చుకున్నట్టు అర్థం అవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలను ఉత్తరాంధ్ర ప్రాంతంగా పేర్కొంటారు. 2004 ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల్లో కలిపి 37 నియోజకవర్గాలు ఉండగా రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకుని అధికార పీఠాన్ని దక్కించుకుంది. విశాఖ జిల్లాలోని 13 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 8, టిడిపి మూడు సీట్లు దక్కించుకోగా, ఓ సీటులో సిపిఎం, మరో సీట్లో బీఎస్పీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. విజయనగరం జిల్లాలోని 12 సీట్లు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లు దక్కించుకోగా, టిడిపి నలుగురు, ఇండిపెండెంట్ నుంచి ఒకరు, సిపిఎం నుంచి మరొకరు గెలుపొందారు. శ్రీకాకుళం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం సాధించి ఏడు సీట్లు గెలుచుకోగా టిడిపి ఐదు చోట్ల విజయం సాధించింది. నియోజకవర్గాల పునర్విభజన తరువాత 2009లో జరిగిన ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు ఈ ప్రాంతంలో గెలుచుకుంది. మొత్తంగా నియోజకవర్గాల పునర్విజన తరువాత ఏర్పడిన 34 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 23 సీట్లు కైవసం చేసుకోగా, టిడిపి ఏడు సీట్లలో ప్రజారాజ్యం పార్టీ మరో నాలుగు చోట్ల విజయం దక్కించుకుంది. ఇక రాష్ట్ర యువజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో గత ఎన్నికలు మాదిరిగానే ఈ ప్రాంతంలోనూ అధిక సీట్లను దక్కించుకున్న పార్టీ అధికారంలోకి వచ్చింది. విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 34 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ 24 స్థానాలను కైవసం చేసుకోగా, వైసీపీ 9 స్థానాలకు పరిమితమైన ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక శ్రీకాకుళం జిల్లాలోని 10 సీట్లలో టిడిపి ఏడు, వైసీపీ మూడు, విజయనగరంలో 9 సీట్లులో ఆరు టిడిపి, మూడు వైసిపి, విశాఖ జిల్లాలోని 15 సీట్లలో 11 టిడిపి, మూడు వైసీపీ, పొత్తులో భాగంగా బిజెపి ఒక సీటు గెలుచుకుంది. అలాగే 2019లో జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని 34 సీట్లలో వైసీపీ 28 సీట్లు గెలుచుకోగా, టిడిపి ఆరు సీట్లకు పరిమితమైన అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
కీలక నాయకులకు అడ్డా..
ఉమ్మడి విభజిత రాష్ట్ర రాజకీయాల్లో ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు కీలకంగా వ్యవహరించారు. ఏ పార్టీ అయినా ఈ ప్రాంతంలోని కీలక నాయకులకు ప్రథమ ప్రాధాన్యతను ఆయా పార్టీల ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది అంటే ఎక్కడ నాయకులు శక్తి సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో దివంగత ఎర్రం నాయుడు, కింజరాపు అచ్చం నాయుడు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, పూసపాటి అశోక్ గజపతిరాజు, పతివాడ నారాయణస్వామి వంటి సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే నాటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత వైసిపిలోనూ ఉద్దండులు ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో కీలక నాయకుడుగా ఎదిగిన బొత్స సత్యనారాయణ, ప్రస్తుత మంత్రి ధర్మాన ప్రసాదరావు, కొణతాల రామకృష్ణ(ప్రస్తుతం ఏ పార్టీలో లేరు), ముత్యాలనాయుడు, ధర్మాన కృష్ణదాస్ తదితరులు ఉన్నారు.
వ్యూహ.. ప్రతి వ్యూహాలతో సిద్ధం..
ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలకు పడునుపెడుతున్నాయి. ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలుగుదేశం, వైసిపి వచ్చి ఎన్నికల బరిలో దిగే అభ్యర్ధులు విషయలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాయి. గెలుపు గుర్రాలపై ఆయా పార్టీలు సర్వేలు నిర్వహిస్తూ వారిని బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక రాజకీయంగా కలిసి వచ్చే అంశాలు నాయకులు పైన ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ఇప్పటికే విశాఖను రాజధానిగా చేస్తామంటూ అధికార ప్రార్టీ ప్రకటించి ఈ ప్రాంత సీట్లను గంపగుత్తగా కొల్లగొట్టాలని భావిస్తోంది. రాజధానిగా విశాఖను ప్రకటించడం తమ కలిసి వస్తుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. అదే సమయంలో కొద్దిరోజులు కిందట నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సబ్మిట్ కూడా తమకు కలిసి వస్తుందని అధికారి పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతం పై ఎక్కువే దృష్టి సారించింది. హుదుహుదు సమయంలో చంద్రబాబు ఈ ప్రాంత అభివృద్ధికి చేసిన కృషి వైసిపి సర్కారు వచ్చిన తర్వాత చేస్తున్న ఆక్రమణలు, అవినీతి వంటి అంశాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెల్లే ప్రయత్నం చేస్తూ ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. రుసుకొండపై వైసీపీ సర్కార్ చేస్తున్న వేధ్వజం స్టీల్ ప్లాంట్ విక్రమ్ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని టిడిపి లెక్కలు వేసుకుంటోంది.

జనసేన పార్టీ కీలకం..!
జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఈ ప్రాంతంలో కీలక శక్తిగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కాపు బీసీ ఓటర్లతో పాటు పెద్ద సంఖ్యలో యువత జనసేన వైపు ఆశగా చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఒక్క సీటు జనసేన గెలుచుకోక పోయినప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి మాత్రం జనసేన బలమైన శక్తిగా ఆవిర్బవించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటే ఈ ప్రాంతంలో బలంగా ఉన్న కాపు బీసు సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో సీట్లు తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఆయా సీట్లను జనసేన గెలుచుకునేందుకు అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఇరు పార్టీలకు లాభదాయకంగా ఉండవచ్చని రెండు పార్టీలు కలిస్తే ఉత్తరాంధ్ర పై పట్టు బిగించడం ఖాయం అన్న భావన విశ్లేషకుల్లో వ్యక్తం అవుతుంది.
మూడు నుంచి అరు జిల్లాలు..
ఉత్తరాంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఈ మూడు జిల్లాల్లో ఉత్తరాంధ్రగా పేర్కొంటారు. ఇంచుమించుగా ఈ మూడు జిల్లాల ప్రాంతాల జీవన శైలి, ఆహారపు అలవాట్లు, మాండలికం ఒకే విధంగా ఉంటుంది. అయితే కొద్దిరోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటు స్థానాలను కేంద్రంగా తీసుకొని జిల్లాలను ఏర్పాటు చేయడంతో మూడు జిల్లాలుగా ఉన్న ఉత్తనాంధ్ర ఆరు జిల్లాలుగా మారింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం పార్వతీపురం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. ఈ ఆరు జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ స్థానాలు 5 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అన్నిచోట్ల పార్లమెంటు స్థానాలను కేంద్రంగా చేసుకొని జిల్లాలను ఏర్పాటు చేయగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మాత్రం ఏజెన్సీ పరిధిలోని నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకొని మన్యం పార్వతిపురం జిల్లాగా అదనపు జిల్లాను ఏర్పాటు చేశారు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి.