
World Kidney Day 2023: మనం తాగే నీరు ను వడకట్టి, శరీరానికి ఖనిజ లవణాలు అందించే బాధ్యతను మూత్ర పిండాలు తీసుకుంటాయి. వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. అవి సరిగ్గా పని చేస్తే ఏ ఇబ్బందీ ఉండదు. కానీ అవి పని చేయక పోతే శరీరం గాడి తప్పుతుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. మారిన పరిస్థితులు, వాతావరణ కాలుష్యం, ఆహారపు అలవాట్లు కూడా మూత్ర పిండాల పని తీరును ప్రభావితం చేస్తున్నాయి. నేడు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ప్రత్యేక కథనం
జబ్బులు ముదురుతున్నాయి
రాష్ట్రంలో కిడ్నీ జబ్బులు ముదురుతున్నాయి. ఏటా 2 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మూత్రపిండాల వైఫల్యంతో బాధపడేవారి సంఖ్య ప్రతి సంవత్సరం భారీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో ప్రతి సంవత్సరం 2 వేలకుపైగా కొత్త కేసులు నమోదు కావడం విశేషం . దాదాపు 3 వేల మంది వరకు మూత్రపిండాల వైఫల్యం (కిడ్నీ ఫెయిల్యూర్) కారణంగా మృత్యువాత పడుతున్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఆరోగ్యశ్రీ గణాంకాల మేరకు రాష్ట్రంలో 5,598 కిడ్నీ ఫెయిల్యూర్ కేసులున్నాయి. ఆ సంఖ్య 2021 నాటికి ఏకంగా 10848కి పెరిగింది. అంటే ఐదేళ్లలోనే కేసుల సంఖ్య దాదాపుగా రెట్టింపు అయింది. ఇక ప్రైవేటులో నమోదయ్యే కేసులకైతే లెక్కే లేదు. సర్కారీ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 12 వేల మంది కిడ్నీ ఫెయిల్యూర్ పేషంట్స్ ఉన్నారు. వీరంతా డయాలసిస్ చేయించుకుంటున్నారు.
ప్రధాన కారణాలు ఇవే
కిడ్నీ ఫెయిల్యూర్‌కు ప్రధాన కారణాలు రక్తపోటు, మధుమేహం. నియంత్రణలో లేని ఈ రెండు దీర్ఘకాలిక జబ్బుల కారణంగా మూత్రపిండాలు దెబ్బతిని వాటి పనితీరు మందగిస్తుంది. జబ్బు ముదిరి బాగా క్షీణించేదాకా కూడా కొందరిలో బయటపడదు. చివరిదశలో బయటపడినా.. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయి ఉంటుందని, కొన్నిసార్లు జన్యుపరమైన కారణాలవల్ల కూడా మూత్రపిండాల వైఫల్యం సంభవిస్తుంది. ఈ సమస్యను మొదటి దశలోనే గుర్తిస్తే సమస్య ముదరకుండా కాపాడుకోవచ్చు. మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్య సమస్య తలెత్తితే కాళ్లు, చేతులు వాస్తాయి. మూత్రంలో రక్తం రావడం, ప్రొటీన్ పోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయి. లక్షణాలు, పరీక్షల ద్వారా రోగ నిర్థారణ చేసి, ముందే మందులిస్తారు. రాష్ట్రంలో కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నవారిలో 30-50 ఏళ్ల వయసువారు 40 శాతం ఉన్నారు. పనిచేసే వయసులో ఉన్న వారు కిడ్నీ జబ్బుల బారినపడటం వల్ల సమాజంలో ఉత్పాదకత దెబ్బతింటోందని, దాంతో వ్యవస్థలపై భారం పడుతోంది.

ఏటా రూ.100 కోట్లు
ఏటా డయాలసిస్ కోసం రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్రం ఏర్పడినప్పటికి నుంచి నేటి వరకు మొత్తం రూ.700 కోట్లు ఖర్చు పెట్టింది. 2014లో రాష్ట్రం ఏర్పడే నాటికి సర్కారీ రక్తశుద్ధి కేంద్రాలు కేవలం 3 మాత్రమే ఉండేవి. ఆ సంఖ్యను ప్రస్తుతం 68కి పెంచినా.. అవి కూడా చాలట్లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సర్కారీ డయాలసిస్ కేంద్రాల సంఖ్యను 102కు పెంచాలని వైద్య శాఖ తాజాగా నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గానికీ ఒక డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచనా ఉంది. అలాగే ప్రస్తుతం 73 ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ కింద డయాలసిస్ సేవలందుతున్నాయి. రెండింటా కలిపి రోజూ 12 వేలమందికి రక్తశుద్ధి చేస్తున్నారు. అయినప్పటికీ కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు డయాలసిస్ పడకలు దొరకడం లేదు. ఉన్న రోగులు చనిపోతే తప్ప.. కొత్త రోగులకు బెడ్స్ దొరకని దుస్థితి కొన్నిచోట్ల నెలకొంది. కాగా.. కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు ప్రభుత్వం ఉచిత బస్‌పాస్, భోజన సదుపాయం కూడా కల్పిస్తోంది. ఆసరా పథకం కింద పెన్షన్ కూడా ఇస్తున్నారు.
మినరల్ వాటర్ వాడకం పెరగడం, మధుమేహం,బీపీ వంటి సమస్యలు ఎక్కువ అవుతుండటం వల్ల కిడ్నీ వ్యాధులు పెరుగుతున్నాయి. చాలా మందికి మూత్ర పిండాల వైఫల్యం అయ్యే దాకా తెలియక పోవడంతో డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీని వల్ల రోగుల పై ఆర్థిక భారం పడుతున్నది.