IAS officer turned Farmer : సాధారణంగా ఐఏఎస్ అధికారులు రిటైర్ తర్వాత ఇతర వ్యాపకాలు చూసుకుంటారు. తాము ఇన్నాళ్లుగా చేయలేని పనులను చేస్తూ ఉంటారు. ఈ కథనంలో చెప్పుకునే ఐఏఎస్ అధికారి కూడా అలానే చేశారు. తన పదవి విరమణ తర్వాత వ్యవసాయం వైపు వెళ్లిపోయారు. అయితే అందరిలాగా సంప్రదాయ విధానంలో వ్యవసాయాన్ని చేయకుండా సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ఏకంగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కేవలం 25% నీటితోనే వారిని సాగు చేసే విధానాన్ని ఆవిష్కరించారు. ఆయనే కహన్ సింగ్ పన్ను ( kahan Singh Pannu).. కహన్ సింగ్ స్వస్థలం పంజాబ్. వారి పూర్వికులు వ్యవసాయం చేసేవారు. కహన్ సింగ్ కు కూడా వ్యవసాయం అంటే ఇష్టమే. కాకపోతే ఐఏఎస్ అధికారి కావడం వల్ల ఆయనకు వ్యవసాయం చేయడం వీలు కాలేదు. పదవి విరమణ చేసిన తర్వాత తను ఒక్కసారిగా రైతుగా మారిపోయాడు. అయితే పంజాబ్ లో రైతులు విస్తారంగా వరి సాగు చేస్తారు. వరి సాగు కోసం భూగర్భ జలాలను విపరీతంగా వినియోగిస్తారు. పంజాబ్ లో వరి సాగు అధికంగా ఉండడం వల్ల భూగర్భ జలాల మీద ఒత్తిడి అధికంగా ఉంది.. ఇదే పరిస్థితి కొనసాగితే 2039 నాటికి పంజాబ్ రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం 1000 అడుగుల కంటే ఎక్కువ పడిపోతుందని ఇటీవలి కేంద్ర ప్రభుత్వ అధ్యయనాలు తెలిపాయి.. పంజాబ్ రాష్ట్రంలో ఇటీవల 87% వరి సాగు చేశారు. భూగర్భ జలాలను అధికంగా వినియోగించడం మొదలుపెట్టారు. అయితే ఇది కహన్ సింగ్ ను కలచి వేసింది. పైగా ఆయన సొంత గ్రామమైన జై నగర్ లో భూగర్భ జలాల మట్టాలు తీవ్రంగా తగ్గడాన్ని ప్రత్యక్షంగా చూడడంతో.. ఏదో ఒక ప్రత్యామ్నాయ ఆలోచన చేయాలని కహన్ సింగ్ ఎంచుకున్నారు.. దానికి కొత్త ఒరబడి ఎంచుకున్నారు.
ఇదే కొత్త పద్ధతి..
వరి సాగు విధానంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన కహన్ సింగ్.. ముందుగా తన పంట పొలాన్ని ట్రాక్టర్ తో దున్నారు.. ప్రత్యేకంగా సాళ్లను ఏర్పాటు చేశారు.. అవసరమైనప్పుడు మాత్రమే ఈ సాళ్లల్లో నీరు సరఫరా అవుతుంది.. దీనివల్ల నీరు నేరుగా వేర్లకు మాత్రమే చేరుతుంది. ఫలితంగా పొలం మొత్తం మునిగే విధంగా నీరు పెట్టాల్సిన అవసరం ఉండదు.. దీనివల్ల వరి సాగుకు కేవలం 25% మాత్రమే నీరు అవసరమవుతుంది. కొంత మొత్తంలోనే ఎక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేయడానికి అవకాశం ఉంటుంది.. ఇదే విధానాన్ని నూటికి నూరు శాతం విజయవంతంగా అమలు చేస్తూ కహన్ సింగ్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఎకరానికి రికార్డు స్థాయిలో 28 క్వింటాళ్ల పంట దిగుబడి సాధించి ఔరా అనిపించారు.. తను ఆవిష్కరించిన SRB విధానంలో బెడ్ (మృత్తిక) పై వరి విత్తనాలను నాటారు.. వాటికి సాళ్ల ద్వారా నీటిని సరఫరా చేయడం మొదలుపెట్టారు. దీనివల్ల 25 శాతం మాత్రమే నీటిని ఆ పంట వినియోగించుకుంటుంది. సాధారణ పద్ధతిలో అయితే ఒక కిలో బియ్యం ఉత్పత్తి చేయడానికి 4000 లీటర్ల వరకు నీరు అవసరం పడుతుంది. పైగా కలుపు మొక్కలను నివారించడానికి రైతులు పంట కాలం మొత్తం పొలాలను నీటితో నింపుతారు. దీనివల్ల నీటి వినియోగం అధికంగా ఉంటుంది. దీనిని నివారించడానికి కహన్ సింగ్ SRB విధానాన్ని తెరపైకి తీసుకొచ్చారు.. దీనివల్ల వంద నుంచి 120 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. ఈ విధానంలో 12 ట్రయల్ సైట్లను ఉపయోగించారు. 1996 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన కహన్ సింగ్.. పంజాబ్ వ్యవసాయ కార్యదర్శిగా పనిచేశారు. 2020లో పదవి విరమణ చేశారు. కాగా, కహన్ సింగ్ ప్రస్తుతం సన్నాల మీద ప్రయోగాలు చేసి విజయవంతమయ్యారు. ఆ తర్వాత బాస్మతి రకాలపై ప్రయోగాలు చేస్తానని చెబుతున్నారు.