93 Year Old Man Marriage: ఏ ప్రాయంలో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అంటారు పెద్దలు. ఎందుకంటే వయసు మీరి పోతే ఏ ఆనందాన్ని.. అనుభూతిని సొంతం చేసుకోవడం సాధ్యం కాదు అని పెద్దలు అంటుంటారు. అది నిజమే.. కాకపోతే వెనుకటి కాలంలో పెద్దలు నాటి పరిస్థితులను ఊహించి ఆ సామెతను వాడుకలోకి తెచ్చి ఉంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వేరు.
పెళ్లికి చివరికి ప్రేమకు.. ఇంకా చెప్పాలంటే చాటు మాటు సంబంధానికి నేటి కాలంలో వయసుతో పనిలేదు. డబ్బుతో.. పలుకుబడితో మాత్రమే పని ఉంది. అతడి వయసు 93 సంవత్సరాలు. ఈ వయసులో కనీసం తన పని తాను చేసుకోవడమే కష్టం. అటువంటిది తన మనవరాలి కంటే తక్కువ వయసు ఉన్న ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ యువతి వయసు కూడా 35 సంవత్సరాలు. 93 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకోవడమే కష్టం అనుకుంటే.. ఏకంగా తండ్రి కూడా అయ్యాడు.
93 సంవత్సరాలు వయసులో అతనికి అంత సామర్థ్యం ఉంటుందా.. అది ఎలా సాధ్యమవుతుంది.. అనే ప్రశ్నలు మీలో ఉదయిస్తున్నాయి కదా.. ఆ 93 సంవత్సరాల వృద్ధుడి పేరు డాక్టర్ జాన్ లెవెన్. ఇతడు ఉండేది మెల్బోర్న్ ప్రాంతంలో. పైగా ఇతడు యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్. అందువల్లే తనకు 93 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ.. ముసలితనం ప్రభావం కనిపించకుండా జాగ్రత్తలు పడుతుంటాడు. ఇతడు 3 5 సంవత్సరాల యానింగ్ అనే మహిళ డాక్టర్ ను ప్రేమించాడు.
డాక్టర్ లెవెన్ మెడికల్ కాలేజీలకు విసిటింగ్ ప్రొఫెసర్ గా వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే యానింగ్ మీద మనసుపడ్డాడు. ఆ తర్వాత ఆమె కూడా అతని ప్రేమను అంగీకరించింది. ఇద్దరు వివాహం చేసుకున్నారు. వివాహం మాత్రమే కాదు పిల్లల్ని కూడా కనాలని అనుకున్నారు. దీంతో డాక్టర్ లెవెన్ ఐవీఎఫ్ ద్వారా డాక్టర్ యానింగ్ గర్భం దాల్చే విధంగా ఏర్పాట్లు చేశాడు. ఇటీవల డాక్టర్ యానింగ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. కాటికి కాళ్లు చాపే వయసులో అతడు పడుచు భార్యతో సంసారం సాగిస్తున్నాడు. అంతేకాదు పండంటి బిడ్డకు తండ్రి కూడా అయ్యాడు.
ఇతడి వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై పలు మీడియా సంస్థలు అతడిని సంప్రదిస్తే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.. ” నేను ప్రతిదీ ఒక నిబంధన ప్రకారం చేస్తుంటాను. ఈ వయసులో నాకు ప్రేమ అవసరం. ఒక తోడు కూడా అవసరం. అందువల్లే ఆమెను ప్రేమించాను. నాకు శక్తి ఉంది. ఇంకా 105 సంవత్సరాల వరకు నేను బతుకుతాను. నా కొడుకును పెరుగుతుంటే ఆనందిస్తాను. సంతానం కావాలనుకుంటే వయసుతో సంబంధం లేదు. ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిస్తే వృద్దులు కూడా చాలా కాలం పాటు బతుకుతారు. వారు మరింత శక్తివంతంగా కనిపిస్తారని” డాక్టర్ లెవెన్ చెప్పడం విశేషం.