10Rupees Doctor : ప్రస్తుతం వైద్యం వ్యాపారంగా మారింది. పొరపాటున అనారోగ్యం వచ్చిందంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. ఇప్పుడున్న కాలంలో ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే కనీస కన్సల్టేషన్ ఫీజు రూ.500-1000 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, పేదల కోసం రూ.10 మాత్రమే తీసుకొని వైద్యం అందిస్తున్న ఓ మహనీయుడి కథ ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.
పాట్నాకు చెందిన డాక్టర్ ఎజాజ్ అలీ. గత 40 ఏళ్లుగా ఈ సేవను కొనసాగిస్తూ లెక్కలేనంత మంది రోగులకు ఉచితంగా, అతి తక్కువ ధరకు అత్యున్నత చికిత్స అందిస్తున్నారు. వైద్య సేవల్ని వ్యాపారంగా మార్చిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన సేవా ధృక్పథం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.
డాక్టర్ ఎజాజ్ నిస్వార్ధ సేవ!
డాక్టర్ ఎజాజ్ తన ప్రాక్టీస్ ప్రారంభించినప్పటి నుంచే పేదల కష్టాలను సమర్థంగా అర్థం చేసుకున్నారు. ఆయనకు వైద్యసేవలు మానవ హక్కుల వంటివని ఆయన గట్టిగా నమ్ముతారు. అందుకే రూ.10 మాత్రమే ఫీజుగా తీసుకుంటూ పేదలకు అత్యున్నత వైద్యం అందిస్తున్నారు.గత నాలుగు దశాబ్దాలుగా వేలాదిమందికి ఆరోగ్య సేవలు అందించి ఆయుష్మాన్ దేవుడిగా మారిపోయారు.
లెక్కలేనన్ని జీవితాలను కాపాడిన దేవుడు
డాక్టర్ ఎజాజ్ తన క్లినిక్‌లో హృదయ సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తున్నారు. అతని దగ్గరకు వచ్చే పేద, నిరుపేద రోగుల కోసం ప్రత్యేకంగా మందులను కూడా తక్కువ ధరకే అందిస్తున్నారు. డాక్టర్ ఎజాజ్ అలీ చేసిన సేవలు తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు.
ఆయన వైద్యం పొందిన వారు తనను దేవుడితో సమానంగా కొలుస్తున్నారు.
‘‘ఇలాంటి డాక్టర్లు మన సమాజానికి అవసరం.. డబ్బుకంటే మానవతా విలువలను గౌరవించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు.’’‘‘ఆయన చేసిన సేవలకు ఎప్పటికీ రుణపడి ఉంటాం..’’ అని ఆయనను కొనియాడుతున్నారు.
వైద్య సేవల్ని వ్యాపారం చేసిన కాలంలోనూ..
ఆరోగ్య సంరక్షణను వ్యాపారంగా మార్చిన ప్రస్తుత పరిస్థితుల్లో డాక్టర్ ఎజాజ్ అలీ చేస్తున్న సేవ అందరికీ స్పూర్తిగా నిలవాలి. చెప్పే వాడికంటే చేసే వాడే గొప్ప.. అన్నట్లు డబ్బు లక్ష్యంగా కాకుండా ప్రజల ఆరోగ్యమే తన లక్ష్యంగా భావించి ఈ మహనీయుడు అందించిన సేవలు అమూల్యమైనవి.