Nabha Natesh: కన్నడ భామ నభా నటేష్ తన హెల్త్ కండిషన్ బయటపెట్టారు. గత ఏడాది తాను సినిమాలు ఎందుకు చేయలేదో వెల్లడించారు. ఆమె సడన్ సోషల్ మీడియా ప్రకటన ఫ్యాన్స్ ని షాక్ కి గురిచేసింది. నభా నటేష్ చివరి చిత్రం మ్యాస్ట్రో. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం హిందీ హిట్ మూవీ అంధాదున్ రీమేక్. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. 2021 సెప్టెంబర్ 17న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఓటీటీలో సక్సెస్ కొట్టినా పెద్దగా పేరు రాదు. థియేటర్లో విడుదలై కమర్షియల్ గా సక్సెస్ అయినప్పుడే కెరీర్ కి ప్లస్ అవుతుంది.

అదే ఏడాది నభా అల్లుడు అదుర్స్ టైటిల్ తో ఓ మూవీ చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లు అదుర్స్ అట్టర్ ప్లాప్. సంక్రాంతి చిత్రంగా విడుదలై దారుణ పరాజయం చవిచూసింది. అంతకు ముందు ఏడాది నటించిన డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. వరుస పరాజయాల నేపథ్యంలో ఆమెకు ఆఫర్స్ రావడం లేదని అందరూ భావించారు. 2022లో నభా నుండి ఒక్క చిత్రం రాలేదు. అలాగే కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు.
వరుస ఫెయిల్యూర్స్ నేపథ్యంలో ఆమెను దర్శక నిర్మాతలు పక్కన పెట్టేశారని అందరూ భావిస్తుండగా… ఆమె షాకింగ్ రీజన్ బయటపెట్టారు. నభా నటేష్ ప్రమాదానికి గురయ్యారట. ఆమె ఎడమ భుజం ఎముకకు ఫ్రాక్చర్స్ అయ్యాయట. పలుమార్లు భుజానికి ఆపరేషన్ చేశారట. ఆ సమయంలో శారీరకంగా, మానసికంగా తీవ్ర వేదన అనుభవించారట. కోలుకోవడానికి సమయం పట్టిందన్న నభా నటేష్… ప్రస్తుతం ఫుల్లీ రికవర్ అయినట్లు వెల్లడించారు.

ప్రమాదం కారణంగా ఎంతో ఇష్టపడే సినిమాలకు దూరమయ్యానని, మీరు నన్ను ఎలా మిస్ అయ్యారో నేను కూడా మిమ్మల్ని మిస్సయ్యాను అని నభా తన సోషల్ మీడియాలో సందేశంలో పొందుపరిచారు. కొత్త ఆశలతో 2023లో అడుగుపెట్టినట్టు తెలియజేశారు. నభా నటేష్ ప్రమాదం గురించి తెలిసిన అభిమానులు షాక్ అయ్యారు. ఈ విషయం నభా ఎన్నడూ వెల్లడించలేదు. ఒక్కసారిగా తనకు యాక్సిడెంట్ జరిగిందని ఆమె చెప్పడం సంచలనంగా మారింది.