Hyper Adi : హైపర్ ఆది.. పరిచయం అక్కరలేని పేరు.. అనామకుడిగా.. సైడ్ క్యారెక్టర్‌గా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది.. ఇప్పుడు ఆయన లేని కార్యక్రమం సక్సెస్ కాలేని స్థాయికి ఎదిగాడు. సాధారణంగా ఇండస్ట్రీలో రాణించాలంటే బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి.. గురువు ఉండాలి.. డబ్బులు కూడా ఉండాలి. కానీ ఇవేమీ లేని ఆది.. తన స్వయం కృషితో ఓ రేంజ్‌కు ఎదగాడు. అంతేకాదు జబర్దస్త్‌కు వచ్చిన తర్వాత ఎదురైనా ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తీర్చడానికి తమకు ఉన్న మూడెకరాలను కూడా ఆది తల్లిదండ్రులు ఆమ్మేశారు. కానీ, తర్వాత తన కృషి, పట్టుదల, సహచర నటుల సహకారంతో క్రమంగా ఎదిగిన ఆది తర్వాత 16 ఎకారాలను కొన్నాడు. స్ఫూర్తిదాయమైన హైపర్ ఆది కష్టాల గురించి ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
నిలదొక్కుకోవడానికి కష్టాలు..
జబర్దస్త్ ప్రారంభంలో అభి ద్వారా ఆది వేదికపైకి వచ్చాడు. అభి టీంలో చాలా ప్రోగ్రాంలు చేశారు. తర్వాత క్కిట్స్ రాయడం కూడా నేర్చుకున్నాడు. పంచులు రాయడం.. అవి పేలడంతో ఆదికి తిరుగు లేకుండా పోయింది. ఆది పంచులకు ప్రేక్షకులు పగలబడి నవ్వడంతో గురువును మించిన శిష్యుడిగా ఎదిగాడు ఆది. దీంతో ఓ మూలన కూర్చుని స్కిట్ ప్రాక్టిస్ చేసే స్థాయి నుంచి తర్వాత స్కిట్‌ను లీడ్‌చేసేస్థాయికి ఎదిగాడు.
వెంటాడిన ఆర్థిక ఇబ్బందులు..
అయితే మొదట్లో ఆది కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. జబర్దస్త్ చేస్తున్నా.. రోజువారీ కూలీలా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. తనకు వచ్చే రెమ్యునరేషన్ సరిపోకపోవడంతో ఇంటి నుంచి డబ్బులు పంపించమని అడిగేవాడు. డబ్బులు లేక పస్తులు ఉన్న రోజులు కూడా ఉన్నాయని ఆది చెప్పాడు. అయితే ఆదికి డబ్బులు పంపించడానికి కుటుంబం గడవడం కోసం ఆది తల్లిదండ్రులు అప్పులు చేశారు. అప్పులు తీర్చే మార్గం లేక ఉన్న మూడెకరాలు అమ్మేశారు.
అందరి సహకారంతో ఎదుగుదల…
అయితే ఆది అనతికాలంలోనే ఎదుగుదల మొదలైంది. దీనికి జబర్దస్త్ యాజమాన్యం మల్లెమాల, ఈటీవీ యాజమాన్యంతోపాటు జడ్జిలు నాగబాబు, రోజా, అభితోపాటు, ఆయనతో కలిసి నటించే నటీనటులు కూడా ఆదిని ఎంకరేజ్ చేశారు. దీంతో ఆది ఎదుగుదలతోపాటే ఆదాయం పెరిగింది. స్కిట్‌లో అవకాశం కావాలని అడిగే స్థాయి నుంచి తనకు ఒక్క చాన్స్ ఇప్పించండి అని అడిగించుకునేస్థాయికి ఎదిగాడు. దీంతో మూడెకరాలు అమ్మిన ఊళ్లోనే 16 ఎకారలు కొన్నాడు.
ఆ ఆనందమే వేరంటాడు..
అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రాన్ని పాటిస్తున్నాడు ఆది. తన ఎదుగుదలకు మూలమైన ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా గుర్తుచేస్తాడు. అంతేకాదు తన ఊళ్లో ఆది జబర్దస్త్‌లో రాణిస్తున్నాడని ఎవరైనా తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారి ముఖంలో కనిపించే ఆనందాన్ని మించిన ఆనంతం ఏదీ లేదంటాడు. తాను ఎదిగిన తర్వాత తన ఎదుగుదలకు కారణమైనవారిని మర్చిపోయేవారు ఉన్న రోజుల్లో ఆది మాత్రం ప్రతీ ఒక్కరినీ గుర్తుపెరట్టుకుని.. తాను కోల్పోయిన భూమిని తిరిగి సంపాదించి ఆదర్శంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచాడు ఆది!