China Lemons: క్షవరం అయితే గాని వివరం అర్థం కాదు..ఇప్పుడు కొవిడ్ వల్ల సంప్రదాయ ఆహారం చైనీయులకు బాగా వివరమవుతున్నది. కోవిడ్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చైనీయులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం విరివిగా వ్యాక్సిన్ వేయకపోవడంతో బతుకు జీవుడా అనుకుంటూ వారికి తోచిన ప్రయత్నాలు వారు చేస్తున్నారు.. వాస్తవానికి శరీరం కోవిడ్ ను తట్టుకోవాలంటే వ్యాధి నిరోధక శక్తి చాలా అవసరం.. కానీ సగటు చైనీయుల్లో ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల కోవిడ్ బారిన పడ్డవారు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. పరిస్థితి విషమించి కన్నుమూస్తున్నారు.. బయటకు చెప్పడం లేదు గాని చైనాలో ఇప్పుడు కరోనా విలయతాండవం చేస్తోంది.. దీనిని నివారించేందుకు ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీ అమలు చేసింది.. నెలలపాటు ఈ తంతు సాగడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. జీరో కోవిడ్ పాలసీ నిబంధనలను సడలించింది. దీంతో ఇప్పుడు ఈ వైరస్ వ్యాప్తి ఉధృతం అవుతోంది.

నిమ్మకాయలకు పెరిగిన డిమాండ్
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత.. ఇప్పుడు చైనా దేశస్థుల విషయంలో నిమ్మకాయలు అలాంటి పాత్ర పోషిస్తున్నాయి.. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు తమ శరీరానికి సి విటమిన్ అందించే చర్యలో నిమగ్నమయ్యారు.. ఇందులో భాగంగా నిమ్మకాయలను విపరీతంగా వినియోగిస్తున్నారు.. దీంతో ఒక్కసారిగా వాటికి డిమాండ్ భారీగా పెరిగిపోయింది.. చైనాలోని సియాయున్ అనియు కౌంటీ లో నిమ్మకాయలు బాగా పండుతాయి.. ఇవి ఇక్కడి నుంచి చైనా, షాంగై ప్రాంతాలకు సరఫరా అవుతాయి. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజుకు 20 నుంచి 30 టన్నుల వరకు ఎగుమతి అవుతున్నాయి. కోవిడ్ కు ముందు ఇవి ఐదు నుంచి ఆరు టన్నులు మాత్రమే అమ్ముడుపోయేవి. డిమాండ్ పెరగడంతో వీటి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి.. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు సి విటమిన్ ఉన్న ఆహార పదార్థాలు మెరుగ్గా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో నిమ్మకాయలను చైనా దేశస్థులు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. వీటితోపాటు నారింజ, పియర్స్, పీచ్ వంటి పండ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. డిమాండ్ పెరగడంతో ప్రజలు ఈ పండ్లను అమ్మే దుకాణాల వద్ద బారులు తీరి కనిపిస్తున్నారు.

ఫార్మా ఫ్యాక్టరీలకు కూడా
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫార్మా ఫ్యాక్టరీలకు కూడా తాకిడి పెరిగింది. ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీ ఎత్తేయడంతో ప్రజలు గుంపులు గుంపులుగా సంచరిస్తున్నారు.. దీనివల్ల వైరస్ వ్యాప్తి అధికమవుతోంది. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.. చైనా ప్రభుత్వం చెప్పడంలేదు గాని ఆస్పత్రులు కోవిడ్ రోగులతో కిటకిటలాడుతున్నాయి.. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక చైనా రాజధాని బీజింగ్ లో రెండు మరణాలు చోటుచేసుకున్నాయి.. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ఈ మరణాల సంఖ్య ఎక్కువ అని వార్తలు వస్తున్నాయి. ఇక శ్మశాన వాటికలకు రోజుకు వందలకొద్దీ మృతదేహాలు వస్తున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.