Rajasthan- Virginity test: ప్రేమ అంటే రెండు మనుసుల కలయిక. పెళ్లి రెండు మనుషుల కలయిక. శృంగారం రెండు తనువుల కలయిక. ఈ క్రతువుల్లో ఎక్కడా మూడో వ్యక్తి ప్రమేయం ఉండదు. ఉండకూడదు. కానీ రాజస్థాన్ లో ఇలా కాదు. భార్యాభర్తల మధ్య వ్యక్తిగతంగా ఉండాల్సిన, గోప్యంగా ఉండాల్సిన శృంగారం అక్కడ పెద్దల మధ్య చర్చల్లో ఉంటుంది. దారుణం ఏంటంటే పెళ్ళయిన అమ్మాయి తాను కన్యనో కాదో నిరూపించుకోవాల్సి ఉంటుంది. నేటి నవీన యుగంలోనూ మూఢ నమ్మకాల వల్ల గోప్యంగా ఉండాల్సిన విషయం పంచాయితీలకెక్కుతోంది. తన తప్పూ లేకపోయినా అమ్మాయి నలుగురిలో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

అది రాజస్తాన్ రాష్ట్రంలోని భిల్వారా జిల్లా.. సన్సీ తెగకు చెందిన ఓ యువతి పై
కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ మానవ మృగం అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలిసినా ఓ కానిస్టేబుల్ కొడుకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. శోభనం రోజున ఆ యువతికి అత్తింటి వారు కన్యత్వ నిర్ధారణ పరీక్ష పెట్టారు. అందులో ఆమె విఫలం కావడంతో చిత్ర హింసలు పెట్టారు. నలుగురిలో పిలిచి పంచాయితీ పెట్టారు. జరిగినా విషయం ముందే చెప్పానని వధువు నెత్తి నోరూ కొట్టుకున్నా పెద్ద మనుషులు వినిపించుకోలేదు. పైగా వరుడి కుటుంబానికి రూ. పది లక్షలు చెల్లించాలంటూ తీర్పు చెప్పారు. వరుడి తండ్రి హెడ్ కానిస్టేబుల్ కు గతంలో ఆ యువతి పై జరిగిన దారుణం తెలిసినా మిన్నకుండి పోవడం గమనార్హం.
ఇంకెన్నాళ్ళు ఈ అరాచకం
కన్యత్వ పరీక్ష… పెళ్లికి ముందే వధువు ఎవరితో నైనా శారీరక సంబంధం కలిగి ఉందో నిర్ధారించే పరీక్ష ఇది. రాజస్థాన్ సన్సీ తెగలో “కుకడీ ప్రాథా” వేడుకగా పిలిచే ఈ ఆచారంలో తొలి రాత్రి వధువు తన భర్త తో కలిసినప్పుడు కన్నె పొర చిరిగి రక్త స్రావం జరగాలి. ఇందుకోసం వారి పడక పై తెల్లటి వస్త్రం పరుస్తారు. కన్నె పొర చిరిగి రక్తం ఆ వస్త్రం పై పడితే, ఆ మరకలను గుర్తించి ఆమె కన్య అని ఒక నిర్ధారణకు వస్తారు. ఆ మహిళ కన్య కాదు అని తెలిస్తే అత్తింటి వారి నుంచి వేధింపులు తప్పవు. కొన్ని సార్లు జరిమానా కూడా చెల్లించి రావాల్సి ఉంటుంది.
ఇంకో తెగలో అగ్ని పరీక్ష
రాజస్థాన్ నుంచి మహారాష్ట్ర వలస వచ్చిన కంజర్ భాత్ తెగలో మహిళల్లో కన్యత్వాన్ని నిర్ధారించేందుకు ఇంచు మించు ఇలాంటి పరీక్షనే పెడతారు. ఇంకొన్ని తెగల్లో అయితే పానీ కా థీజ్ అని ఒక పరీక్ష పెడతారు. ఇందులో వరుడు వంద అడుగులు వేయాలి. అవి పూర్తి అయ్యే వరకు వధువు ఊపిరి బిగపట్టి నీటిలోనే ఉండాలి. లేని పక్షంలో అత్తింటి వారి నుంచి వేధింపులు తప్పవు. మరికొన్ని చోట్ల వధువు చేతిలో నింపుల కుంపటి ఉంచుతారు. ఆమె దానిని కొద్ది సేపు అలా పట్టుకోవాలి. లేకుంటే గతంలో ఎవరితో శారీరక సంబంధం పెట్టుకున్న సంగతి అందరి ముందు చెప్పాలి. లేకుంటే అత్తింటి వారి నుంచి వేధింపులు తప్పవు. రాజస్థాన్ లోని కొన్ని తెగల్లో కుక్రీ కా రసం అనే పేరుతో పరీక్ష నిర్వహిస్తూ ఉంటారు. దీని ప్రకారం శోభనం రోజు వధువు వరుడు కలిసినప్పుడు కన్నె పొర చిరిగి బెడ్ పై పరిచిన తెల్లటి వస్త్రం పై రక్తపు మరకలు ఉండాలి. లేకుంటే ఆమె కన్య కాదని తెల్చేస్తారు. ఈ తెగల్లో కొందరు అయితే శోభనం గది ఎదుట నిలబడి కుటుంబ సభ్యులు, బంధువులు నిలబడి నిరీక్షిస్తూ ఉండటం గమనార్హం. ఇవే కాకుండా రెండు వేళ్ళని ఉపయోగించి కన్యత్వ నిర్ధారణ పరీక్ష చేస్తుంటారు. గతంలో అత్యాచార బాధితులను పరీక్షించేందుకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ తరహా పరీక్ష చేసేవారు. ఇది అశాస్త్రీయమని తేలడంతో నిలిపేశారు. అయితే కొన్ని తెగల్లో ఈ విధానాన్ని అమలు చేస్తుండటం గమనార్హం.

నవీన యుగంలో ఈ రాతి పరీక్షల వల్ల ఎంతో మంది యువతులు నరకం చవి చూస్తున్నారు. ఏ తప్పూ చేయకపోయినా కన్యత్వ నిర్ధారణ పరీక్షలో విఫలం అవడంతో నిందలు, అవమానాలు మోసిన మహిళలు ఎంతో మంది. అవమాన భారం మోయలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా. పెద్ద మనుషులు చేసే పంచాయితీల్లో విధించిన జరిమానా చెల్లించకపోతే వారిని వెలివేసేందుకు కూడా వెనుకాడరు. ఇలాంటి ఘటనలు మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నాయని డబ్ల్యూహెచ్ వో నెత్తి నోరు మొత్తుకున్నా పట్టించుకునే వారెవరు?