Balakrishna- Nara Lokesh: ఆయనో నియోజకవర్గానికి ఎమ్మెల్యే. కానీ అధికారపార్టీ నేతలు చుట్టపుచూపు అంటూ విమర్శిస్తారు. రాజకీయాలంటే అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తారని చెబుతారు. నెలకోసారి వచ్చి సినిమా డైలాగులు నాలుగు పడేసి పోతారని ఎద్దేవా చేస్తారు. కానీ ఆ నేత ఇప్పుడు రాజకీయంగా కీలక బాధ్యతల్ని తీసుకున్నారు. ఏపీలో తిరిగేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ నేత ఎవరో స్టోరీలో చదివేయండి.

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ టీడీపీలో కీలక బాధ్యతల్ని తీసుకున్నారు. ఎమ్మెల్యేగా ఉన్నా సరే రాజకీయాలను పెద్దగా పట్టించుకోరు. అప్పడప్పుడు సినిమా డైలాగ్లు పేల్చడం తప్పా ప్రత్యక్ష రాజకీయాల్లో అంత యాక్టివ్ గా ఉండరు. తన వృత్తి అయిన సినిమా పైనే ప్రధానంగా దృష్టిపెడతారు. కానీ బాలయ్య అల్లుడు నారాలోకేష్ ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంలో బాలయ్య పై చంద్రబాబు పెద్ద బాధ్యతనే పెట్టాడు. ఇప్పటి వరకు షూటింగ్ గ్యాప్లో హిందూపురం వెళ్లొచ్చిన బాలయ్య అల్లుడి కోసం కదనరంగంలో ఫుల్ టైం ఉండక తప్పడంలేదు.
ఈనెల 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభమవుతుంది. కుప్పంలో మొదలై రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కిలోమీటర్లు.. 400రోజులు తిరుగుతారు. ఈ సందర్భంలో కుప్పంలో జరిగే పాదయాత్రలో బాలకృష్ణ పాల్గొనాలని చంద్రబాబు సూచించారట. ఒక్క కుప్పంలోనే కాకుండా రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో సాగే పాదయాత్రలో బాలయ్య పాల్గొనేలా చంద్రబాబు ప్లాన్ చేశారట.

బాలయ్యను పాదయాత్రలో భాగం చేయడం వెనుక బాబు వ్యూహం ఉందని తెలుస్తోంది. పాదయాత్రకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వచ్చినా సరే.. జూనియర్ ఎన్టీఆర్ రారు. నందమూరి కుటుంబలో మాస్ ఇమేజ్ ఉన్న హీరోలు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎలాగూ రాడు కాబట్టి బాలయ్యను పాదయాత్రలో భాగం చేయాలనే ప్లాన్ చేశారట. తద్వార నందమూరి కుటుంబం పాదయాత్రలో పాల్గొన్నట్టు ఉంటుంది. నారాలోకేష్ పాదయాత్రకు మాస్ ఇమేజ్ కూడా తోడవుతుంది. నందమూరి కుటుంబం లేని నారా పాదయాత్ర అన్న మచ్చ రాకుండా ఉంటుందని బాబు ప్లాన్ చేశారట.
స్వతహాగా బాలయ్యకు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి ఉండదు. అందుకే ఎక్కడా కీలకంగా పాల్గొనరు. రావాలి కాబట్టి వచ్చాం.. అన్నట్టు మర్యాదపూర్వకంగా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చంద్రబాబు పాదయాత్ర చేసి ఉంటే పెద్దగా పట్టించుకునేవాడు కాదేమో. కానీ పాదయాత్ర చేసేది బిడ్డనిచ్చిన అల్లుడు కాబట్టి బాలయ్య తప్పక పాల్గొనాలి. బాలయ్యకు అల్లుడి భవిష్యత్తు కూడా ముఖ్యమే కదా.