Uttar Pradesh: పరీక్షల్లో జైశ్రీరామ్ అని రాశారు.. ప్రొఫెసర్లు పాస్ చేశారు

ఉత్తర ప్రదేశ్ లోని వీర్ బహుదూర్ సింగ్ పూర్వాంచల్ పేరుతో ఒక విశ్వవిద్యాలయం ఉంది. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో ఇటీవల డీ ఫార్మసీ వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం అత్యంత కఠినంగా వచ్చింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 27, 2024 1:35 pm

Uttar Pradesh

Follow us on

Uttar Pradesh: సాధారణంగా వార్షిక పరీక్షల్లో.. ప్రశ్నలకు తగ్గట్టుగా సమాధానం రాస్తే మార్కులు లభిస్తాయి. ఆ మార్కులు ఎక్కువ వస్తే మంచిర్యాంకు వస్తుంది. మంచిర్యాంకు లభిస్తే ఇంకా ఉన్నత చదువులు చదవచ్చు. పోటీ పరీక్షల్లో నెగ్గి అత్యున్నత ఉద్యోగాన్ని సాధించవచ్చు. కానీ, ఉత్తర ప్రదేశ్ లోని ఓ యూనివర్సిటీ విద్యార్థులు వార్షిక పరీక్షల్లో తమకు ఎదురైన ప్రశ్నలకు పొంతన లేని సమాధానం రాశారు. అయినప్పటికీ వారిని ప్రొఫెసర్లు పాస్ చేశారు. ఆ విషయం బయటికి పొక్కడంతో కలకలం చెలరేగింది.

ఉత్తర ప్రదేశ్ లోని వీర్ బహుదూర్ సింగ్ పూర్వాంచల్ పేరుతో ఒక విశ్వవిద్యాలయం ఉంది. ఈ విశ్వవిద్యాలయం పరిధిలో ఇటీవల డీ ఫార్మసీ వార్షిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కెమిస్ట్రీ ప్రశ్నాపత్రం అత్యంత కఠినంగా వచ్చింది. ఆ ప్రశ్నలకు సమాధానాలు రాయలేక కొంత మంది విద్యార్థులు విచిత్రమైన మార్గాన్ని ఎంచుకున్నారు. పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానంగా జైశ్రీరామ్ అంటూ రాశారు. కొంతమంది విద్యార్థులు అయితే క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్థిక్ పాండ్యా పేర్లను రాశారు. వాస్తవానికి విద్యార్థులు ఇలా రాస్తే వారిని ఫెయిల్ చేయాలి. కానీ, ఆ ప్రొఫెసర్లు ఆ విద్యార్థులను పాస్ చేశారు. దీంతో ఈ విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో.. ఒక్కసారిగా చర్చకు దారి తీసింది.

వీర్ బహుదూర్ సింగ్ పూర్వాంచల్ పరిధిలో డీ ఫార్మసీ కోర్స్ అత్యంత కఠినంగా ఉంటుందట. పైగా ఈ సంవత్సరం నిర్వహించిన పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ అత్యంత క్లిష్టమైన ప్రశ్నలు అడిగారట. అందుకే విద్యార్థులు ఈ మార్గాన్ని ఎంచుకున్నారట. తాము ఏం రాసినా పట్టించుకోకుండా ఉండేందుకు.. మంచి మార్కులు వేసి పాస్ చేసేందుకు ముందుగానే ప్రొఫెసర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారట. వారికి భారీగా డబ్బులు ముట్ట చెప్పారట. విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు తీసుకున్న ప్రొఫెసర్లు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వారిని పాస్ చేశారట. అయితే ఈ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది..

వాస్తవానికి ఆ పరీక్షలో పాస్ కావడమే కష్టం. కానీ, ఆ విద్యార్థులు 60 శాతం మార్కులు సాధించారు. దీంతో చాలామందిలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఫలితంగా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నాయకుడు దివ్యాన్ష్ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్, వైస్ ఛాన్స లర్ కు లేఖలు రాశారు. అంతేకాదు, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరారు. అవకాశం ఉంటే పునర్ మూల్యాంకనం జరపాలని కోరారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వ్యవహారం పట్ల వైస్ ఛాన్స్ లర్ వందనా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అడ్డగోలుగా మార్కులు వేసిన ప్రొఫెసర్లు వినయ్ వర్మ, మనీష్ గుప్తాను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు.

“జై శ్రీరామ్ అనేది భక్తికి సంబంధించింది. అంతేతప్ప వార్షిక పరీక్షల్లో ప్రశ్నకు సమాధానం కాదు. పైగా క్రికెటర్ల పేర్లు కూడా విద్యార్థులు రాశారు. అడిగిన ప్రశ్నకు, విద్యార్థులు రాసిన జవాబుకు పొంతనలేదు. ఇలాంటప్పుడు వారిని ఫెయిల్ చేయాలి. కానీ, బాధ్యతను మరచిన ప్రొఫెసర్లు డబ్బులకు అమ్ముడుపోయి మార్కులు వేసి ఆ విద్యార్థులను పాస్ చేశారు. ఇది సరైన పద్ధతి కాదు. అందువల్లే వారిని సస్పెండ్ చేస్తున్నాం. విద్యార్థులను కూడా విచారిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూసుకుంటామని” వైస్ ఛాన్స లర్ ప్రకటించారు.