Harirama Jogaiah Letter: ఏపీలో కాపులు ముందున్న కర్తవ్యం జగన్ ను పవర్ కు దూరం చేయడం. పవన్ ని అధికారానికి దగ్గర చేయడం. ఆ రెండే ఇప్పుడు కాపులకు ప్రాధాన్యతాంశాలుగా మారిపోయాయి. వైసీపీ హయాంలో కాపులు ఎంత వంచనకు గురికావాలో అంతలా గురయ్యారు. వారి చిరకాల స్వప్నమైన రిజర్వేషన్లకు ఒక ఇంచి అడుగుపడలేదు. కనీసం చంద్రబాబు ఇచ్చిన 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లు సైతం రద్దుచేసి నాలుగేళ్లుగా సంక్షేమ పథకాలు దక్కకుండా చేశారు. పోనీ నవరత్నాల్లో అయినా న్యాయం చేశారా? ప్రత్యక ఉత్తర్వులిచ్చి కాపులకు వర్తింపజేసేలా చేశారా? అదీ లేదు. విదేశి విద్య లేదు. ఉద్యోగ, ఉపాధి కల్పన లేదు. అందుకే కాపులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. జగన్ ను గద్దె దించాలని నినదిస్తున్నారు. సంఘటితమవుతున్నారు.

జగన్ ను అధికారం నుంచి దించాలంటే పవన్ బలం చాలదు. అందుకు చంద్రబాబుతో స్నేహం చేయడం అనివార్యం. అయితే దానిని తప్పుపట్టని కాపులు. ఎన్నికల తరువాత ఏంటన్నది? మాత్రం ప్రశ్నిస్తున్నారు. ఓట్లు, సీట్లుతో పాటు పవర్ ను సైతం పంచుకుంటేనే కాపులు అంతిమంగా కోరుకుంటున్న చిరకాల స్వప్నం నెరవేరుతుందని భావిస్తున్నారు. ‘ఇప్పుడు కాకుంటే ఎప్పుడు’ అన్న బలమైన నినాదం కాపుల్లో పెల్లుబికుతోంది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఏపీ వ్యాప్తంగా విస్తరిస్తోంది. అందులో భాగమే మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య లేఖాస్త్రం. ఏపీ ప్రజలకు కాపు సంక్షేమ సంఘం ప్రతినిధిగా విడుదల చేసిన లేఖ వైరల్ గా మారుతోంది. ప్రధానంగా కాపుల్లో ఆలోచన రగిలిస్తోంది.
అయితే కాపుల బలమైన ఆకాంక్షను హరిరామజోయ్య లేఖ రూపంలో ఆవిష్కృతం చేశారు. ప్రతీ కాపు సోదరుడు మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరిచారు. ఒకసారి లేఖలోని సారాంశం పరిశీలిస్తే …వైసీపీని ఓడించాలంటే జనసేన-టీడీపీ పొత్తు వుండాల్సిందే. ఇదే కాపు సంక్షేమ సేన ఆకాంక్ష. అయితే ముఖ్యమంత్రిగా పవన్‌కల్యాణ్ ఉండాల్సిందే… ఇదే కాపు సంక్షేమ సేన డిమాండ్. రాక్షస పాలన, అభివృద్ధి రహిత పాలన, అవినీతి పాలన సాగిస్తున్న వైసీపీ అధినేతను రానున్న ఎన్నికల్లో ఓడించడమే కాదు, జనసేన లక్ష్యం పవన్‌కల్యాణ్‌ని ముఖ్యమంత్రి చేయడం ద్వారా బడుగు, బలహీన వర్గాల రాజ్యం ఏర్పాటు చేయడమే కాపు సంక్షేమ సేన ముఖ్య ఆశయం “అంటూ హరిరామజోగయ్య పేర్కొన్నారు.

ఇప్పటికే కాపు సామాజికవర్గంతో పాటు వెనుకబడిన వర్గాల నుంచి పవన్ ను ముఖ్యమంత్రి చేయాలన్న బలమైన ఆకాంక్ష వెల్లివిరుస్తోంది. అటు జన సైనికులు కూడా నినదిస్తున్నది అదే. అయితే టీడీపీతో వెళ్లాల్సి రావడం అనివార్యమైనా.. దానిని అర్ధం చేసుకుంటూనే చంద్రబాబుతో జాగ్రత్తగా వెళ్లాలన్న సూచన, జాగ్రత్తలు కాపు సమాజం నుంచి పవన్ కు వెళుతున్నాయి. హరిరామజోగయ్య లేఖాస్త్రంతో అది స్పష్టంగా బయటపడిందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. పవన్ సీఎం అన్న స్లోగన్ ఏపీ వ్యాపితం అవుతోంది. ఎన్నికలనాటికి పతాక స్థాయికి వెళుతుందని విశ్లేషణలు సైతం వెలువడుతున్నాయి.