Amaravati Farmers Padayatra: సంకల్పం గొప్పదంటూరు. సంకల్ప సిద్ధికి మనుషులు దైవంపై ఆధారపడతారు. తమకు కష్టం ఎదురైనా, కడగండ్లు ఎదురైనా ముందుగా గుర్తొచ్చేది దైవమే. అందుకే కష్టాలు తీర్చు భగవంతుడా నీకు మొక్కలు తీర్చుకుంటామంటారు. ఇక ఎదుటి మనిషి రూపంలో వస్తే వారి మనసు మార్చు దేవుడా అని కోరుకుంటారు. అయితే అమరావతి రైతులు ఇప్పుడు అదే కోరుకుంటున్నారు. జగన్ సర్కారు మనసు మార్చాలని వారు మొక్కని దేవుడు లేడు. మెట్లు ఎక్కని గుడులు లేవు. అయితే చివరకు అరసవల్లిలోని సూర్యనారాయణ స్వామి వారికి మొర పెట్టుకుంటామని బయలుదేరిన అమరావతి రైతులకు జగన్ సర్కారు ఉక్కుపాదంతో అణిచివేసిన సంగతి తెలిసిందే. పోలీస్ లాఠీలకు పనిచెప్పి.. న్యాయస్థానాలకు తప్పుడు సమాచారమిచ్చి పవిత్ర పాదయాత్రకు అడ్డగించింది. అమరావతి రైతుల అరసవల్లి మొక్కు తీరకుండా ఉండిపోయింది. అయితే అమరావతి రాజధాని కమిటీ నేత గద్దె తిరుమలరావు మరో ఇద్దరితో కలిసి పవిత్ర పాదయాత్రతో అరసవల్లి మొక్కు తీర్చుకున్నారు. అమరావతి రైతుల అసంతృప్తిని తీర్చగలిగారు.

ఈ నెల 11న తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి తిరమలరావు మరో ఇద్దరు అమరావతి రైతులతో కలిసి పాదయాత్రగా బయలుదేరారు. ఎక్కడా బయట పడకుండా సైలెంట్ గానే యాత్ర సాగింది. ఈ నెల 22న అరసవల్లి దేవస్థానానికి చేరుకుంది. టీడీపీ నాయకులు, అమరావతికి మద్దతు తెలిపేవారు ఘన స్వాగతం పలికారు. అమరావతి రాజధానికి మద్దతుగా వారు మొక్కులు చెల్లించుకున్నారు. పవిత్ర కార్యాన్ని సమాప్తం చేసినందుకు వారు ఆనందం వ్యక్తం చేశారు. ఎంతో నిష్టతో, పవిత్ర ఆశయంతో అమరావతి టూ అరసవల్లి పాదయాత్రను పూర్తిచేసినట్టు సంతృప్తి వ్యక్తం చేశారు.

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు సెప్టెంబరు 12న అమరావతి టు అరసవల్లి పాదయాత్రను ప్రారంభించారు. గుంటూరు, కృష్ణ, పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర దిగ్విజయంగా ముగిసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో యాత్రకు అధికార వైసీపీ శ్రేణులు అడ్డుతగిలాయి. విధ్వంసకర ఘటనలకు దారితీశాయి.అయినా మొక్కవోని దీక్షతో యాత్ర చేపట్టిన అమరావతి రైతులు 40 వ రోజు అక్టోబరు 22న రామచంద్రాపురం నుంచి బయలుదేరుతున్న క్రమంలో పోలీసులు అడ్డగించారు. కోర్టు నిబంధనలను సాకుగా చూపి అమరావతి రైతులపై కర్కశంగా వ్యవహరించారు. దీనిపై హైకోర్టుకు వెళ్లాలన్న తలంపుతో తాత్కాలికంగా పాదయాత్రకు బ్రేక్ నిచ్చారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు రాకపోవడంతో యాత్ర ఇంతవరకూ తిరిగి ప్రారంభం కాలేదు. ఆ గురుతర బాధ్యతను తీసుకున్న అమరావతి రాజధాని కమిటీ నేత గద్దె తిరుమలరావు ఆగిన చోట నుంచే పాదయాత్ర ప్రారంభించారు. అరసవల్లి సూర్యనారాయణ సన్నిధిలో పూజలు చేసి యాత్ర ముగించుకున్నారు. అమరావతి రైతుల తరుపున మొక్కుబడులు చెల్లించుకున్నారు.