Gummadi Venkateswara Rao: ఈ తరంలోనూ ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ గురించి గొడవలు జరుగుతున్నాయి.. అక్కినేని తొక్కినేని అంటూ బ్లడ్ బ్రీడ్ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. మున్ముందు ఇది మరింత పతనానికి దారి తీస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇటువంటి లేకి మాటల పరిధిలోకి, కులాల సమరంలోకి, సో కాల్డ్ వంశాల చట్రంలోకి ఇమడని నటుడు ఉన్నాడు. సూటిగా చూపు, దీటైన ముక్కు, సమానంగా పెరిగిన గడ్డంతో హుందాగా నడిచొచ్చే ఆ పెద్దమనిషిని చూస్తే రారాజుకే కాదు… మనకూ చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది.. దుర్యోధనుడు అంటే ఏదో ప్రయోజనం ఆశించి కాళ్ళూ, కాకాలూ పట్టాడు అనుకుందాం. మనకు మాత్రం దర్పం చూసినా, ఆ గొంతులోంచి జాలువారే స్పష్టమైన తెలుగు పదాల విన్నా కాసేపు ఆయన అలాగే తెరమీద కనబడితే బాగుండనే అనిపిస్తుంది.. ఇంతకీ ఆయన పేరు చెప్పలేదు కదూ.. ఆయనే గుమ్మడి.
ఆ మధ్య “బలరాముడు అంటే ఎవరు” అని అడిగింది మా పాప.. ” కృష్ణుడికి అన్నయ్య” అని చెప్పాలని అనుకున్న వాణ్ణే “గుమ్మడి” అనేశాను.. అనుకోకుండా అన్నాగానీ… నిజానికి నేను అనుకునేది అదే… నేటివిటీ, యావత్ తెలుగు ప్రజలు కూడా అదే అపోహలో ఉన్నారు. అంతలా తెరపైన ముద్ర వేసిన నటుడు తెలుగు కళామతల్లి గుర్తింపు నోచుకోలేకపోయాడు.. హీరో వంటి రూపం ఉన్న అతను తండ్రిగా, మామయ్యగా, పేద పురోహితుడుగా మిగిలిపోయాడు.. సో కాల్డ్ దర్శకుల లేకితనానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మిగిలిపోయాడు. బలమైన నేపథ్యం కనుక ఉండి ఉంటే ఇవాల్టికి స్ఫురణలో ఉండేవాడు.
శకుని ముందుగానే చెబుతాడు.. ఆ బలరాముడు ముఖస్తుతికి పడిపోతాడని… అన్నట్టుగానే దుష్ట చతుష్టయం చేసిన దొంగ మర్యాదలకు మిక్కిలి సంతోషంతో ఉప్పొంగి పోతాడు.. ఉప్పొంగడాన్ని ఇంతవరకూ తెరమీద అంతలా ఎవరూ ఆవిష్కరించలేదు.. ఆవిష్కరించబోరు. తనకు అంతటి సత్కారం లభించింది అన్న ఆనందం నర నరానా పాకుతుంటే ఆపుకోలేని భావోద్వేగాన్ని ముఖమంతా పరుచుకుని మనకందరికీ అర్థమయ్యేలా చూపిస్తాడు.. అంతలా ఒక దృశ్యం పండాలంటే ఆ పాత్రలో ఎంతలా మమేకమవ్వాలి? అదీ కేవలం 30 ఏళ్ల వయసు ఉన్న నటుడికి ఎలా సాధ్యం?
తనకంటే వయసులో పెద్దవారైన హీరోలకు అనేక చిత్రాల్లో తండ్రిగా, మామగారిగా నటించి, ఒక ముద్ర వేయించేసుకున్నాడు. నిజానికి ఆయన నటించిన ఏ చిత్రంలోనూ తన శరీర ఆకృతిని కోల్పోలేదు. చక్కని రూపంతో, కనీసం గుప్పెడు పొట్ట కూడా కనపడని అంత అందమైన తండ్రికి ఎక్కడికి అక్కడ వేలాడిపోయే కొవ్వెక్కిన హీరోలు కొడుకులుగా నటిస్తూ… డాడీ డాడీ అంటూ ఉంటే.. ఈ కళ్ళతోనే చూసి, ఈ చెవులతోనే విని ఇంకా బతికే ఉన్నాం.. జీవిత రంగం అనే సినిమా చూశారా? కథా పరంగా అదొక టిపికల్ బాలచందర్ సినిమా.. తెలుగులో వేరే దర్శకుడు పని చేశారు.. అందులో గుమ్మడి ఒక పేద పురోహితుడు.. అధిక సంతానం, కటిక దరిద్రం.. భార్యగా సావిత్రి నటించింది. తినడానికి తిండి గింజలు కూడా నిండుకుంటాయి.. ఊళ్లో ఎవరూ ఆచార వ్యవహారాలు పాటించడం లేదని వాపోయే సంప్రదాయ బాపడు.. తద్దినాలు, పరకర్మలు నిష్టగా చేయని వారితో గొడవపడి, చేసే కార్యక్రమం మధ్యలోనే ఆపేసి సంభావన కూడా తీసుకోకుండా ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. పెద్ద కూతురు ప్రమీల ఉద్యోగం కోసం వెళ్లి, అనుకోని పరిస్థితుల్లో మోసానికి గురవుతుంది.
రోజు తనకు మొదటి జీతం వచ్చిందంటూ 150 రూపాయలు తీసుకొచ్చి తండ్రి చేతిలో పెట్టి పాదాలపై పడుతుంది. ” నోరారా ఆశీర్వదించలేవా నాన్నా నన్ను? అని అడుగుతుంది.. కూతురు ఇచ్చిన నోట్లను రెండు చేతుల్లోనూ ఆశ్చర్యంతో చూసుకొని అర్ధ రూపాయికి, రూపాయికి ఆనందపడిపోయి ఆశీర్వదించే పురోహితుణ్ణమ్మా నేను! ఏమిటో, ఇంత డబ్బు చూసేటప్పటికి నోటి మాట రావడం లేదు నాకు.. అంటూ ఉద్వేగ పడిపోతాడు. ఈ సన్నివేశం చూసిన ఎవరికైనా దుఃఖం పెల్లుబుకి రావడం ఖాయం. అంతలా కదిలించేసిన బాలచందర్ మీద కోపం, అంత హృదయ విదారకంగా నటించిన గుమ్మడి మీద ఆగ్రహం ఏకకాలంలో కలుగుతాయి.. సినిమా మాధ్యమానికి ఇంత శక్తి ఉంటుందా? ఇలా ఏడిపించగల ప్రతిభావంతమైన నటనను ఆయనకు ఏ దేవుడు ప్రసాదించాడు? ఇదంతా రాస్తూ ఉంటే ఆ దృశ్యం కళ్ళ ముందు కదలాడి కనులు తడి బారుతున్నాయి.
సంపూర్ణ రామాయణంలో విశ్వామిత్రుడు వచ్చి ఈ యాగ సంరక్షణకై రాముడిని తనతో పంపమని కోరినప్పుడు పట్టాభిషేకాన్ని ఆపి, రాముడిని అడవుల పాలు చేయమని కైక వరం అడిగినప్పుడు దశరధుడి ఆక్రోశం, ఆవేదన చూస్తే గుమ్మడితో పాటుగా మనకూ గుండె పట్టేస్తుంది. ఆ తండ్రి మనసు ఎంత తలడిల్లిపోయిందో, ఎంత ఆవేదన అనుభవించాడో? స్వయంగా తనకు తానే దశరధుడిగా మారిపోయి, తన సొంత కుమారుడినే వదులుకుంటున్నంత విషాదాన్ని అణువణువునా శరీరం అంతా నింపుకొని అద్వితీయమైన నటనతో మనందరినీ ఏడిపించేస్తాడు గుమ్మడి. అదంతా దర్శకత్వ ప్రతిభ ఒకటే కాదు.. ఆ పాత్రలన్నీ గుమ్మడి కోసమే ఉద్భవించాయి.. అదే గుమ్మడి భృగు మహర్షిలా విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో మనందరినీ ఆశ్చర్యపరుస్తాడు.. ఇక దురదృష్టవశాత్తు గుండెపోటుకు, లంకె పెట్టి అనేక చిత్రాల్లో ఆయన్ని మంచాన పడేయడమో, మంగళం పాడేయడమో చేశారు మన రచయితలు, దర్శకులు.. ఒక్కసారి బ్లాక్ కలర్ సూట్ లో, చేతిలో స్మోకింగ్ పైపుతో గుమ్మడిని ఊహించుకోండి.. ఆ నిండైన విగ్రహంలో ఎంతో అందం కనిపిస్తుంది. ఆకారం ఒకటే చాలు అనుకుంటే మనకు చాలామంది ఉన్నారు అందమైన నటులు. ఎన్ని సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్న ఇప్పటికి గట్టిగా నాలుగు సంభాషణల్ని కూడా తప్పులు లేకుండానో, భావం కోల్పోకుండానో పలకగలిగే సామర్థ్యం మాత్రం శూన్యం.. కేవలం ఆకారం ఒకటే కాకుండా నవరసాలనూ అవలీలగా పోషించగల సహజ నటుడు మాత్రం గుమ్మడి ఒక్కడే. ఈరోజు మహా నటుడి వర్ధంతి.. ఓ తరం వారు ఓన్ చేసుకున్న సినీ మామయ్యకు మన: పూర్వక అక్షర నివాళులు.