Team India- Gujarat players: హార్దిక్ పాండ్యా, శుభ్ మన్ గిల్, రుత్ రాజ్ గైక్వాడ్, శివమ్ మావి, దీపక్ హుడా…వీరంతా టీం ఇండియా ఆటగాళ్లని అందరికీ తెలుసు. కానీ వీరంతా గుజరాత్ వాళ్లని చాలా తక్కువ మందికే తెలుసు. అందుకే అభిమానులు సోషల్ మీడియా వేదికగా టీం ఇండియా గుజరాత్ టీం గా మారిపోయిందని ఆరోపిస్తున్నారు. . రుత్ రాజ్ గైక్వాడ్, ఆర్ష్ దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ లను పక్కన పెట్టి మరీ వీరికి అవకాశాలు ఇవ్వటమే అభిమానుల ఆరోపణలకి ప్రధాన కారణం. గత కొంతకాలంగా గుజరాత్ ఆటగాళ్లకు భారత జట్టులో అనవసర ప్రాధాన్యత లభిస్తుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది.

పాపం త్రిపాఠి
ఇక ప్రస్తుతం టీమిండియా యువ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి కి ప్రతిసారీ నిరాశే ఎదురవుతున్నది. టీం ఇండియా ద్వితీయ శ్రేణి జట్టు ఆడిన ప్రతీ సిరిస్ కు ఎంపికైన రాహుల్ త్రిపాఠి తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోతున్నాడు.. పూర్తిగా బెంచ్ కే పరిమితమవుతున్నాడు. వాటర్ బాయ్ గా జట్టుకు సేవలందిస్తున్నాడు.. శ్రీలంక టూర్ కు ఎంపిక అయినప్పటికీ అతడి రాత మారలేదు.. ఆరంగట్రం చేయడం ఖాయమని భావించిన అభిమానులకు ఈసారి కూడా నిరాశే ఎదురయింది.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కు విశ్రాంతి ఇవ్వడంతో ఈసారి రాహుల్ ఆడడం కచ్చితమని అభిమానులు అనుకున్నారు. కానీ వారి అంచనాలను తలకిందులయ్యాయి.
రాహుల్ లేకుండానే
శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ లో టీమిండియా రాహుల్ త్రిపాఠి లేకుండానే బరిలోకి దిగింది. ఈ మ్యాచ్ తో శుభ్ మన్ గిల్, శివమ్ మావి టీ 20 లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే గిల్ విఫలమవగా…శివమ్ నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక రాహుల్, రుత్ రాజ్ రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యారు. ఇషాన్ తో కలిసి రుత్ రాజ్ ఆడతాడని అందరూ భావించగా.. మేనేజ్ మెంట్ గిల్ కు అవకాశం ఇచ్చింది. అర్శ్ దీప్ ఫిట్ గా లేక పోవడంతో శివమ్ మావి అవకాశం అందుకున్నాడు. అయితే రాహుల్ కు అవకాశం ఇవ్వకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ అందించేందుకే రాహుల్ ను జట్టులోకి తీసుకుంటున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. దేశవాళీ క్రికెట్ లో సెంచరీల మోత మోగించిన రుతు రాజ్ గైక్వాడ్ ను పక్కన పెట్టడం సరికాదు అంటున్నారు. గత ఏడాది జిడ్డు బ్యాటింగ్ తో కే ఎల్ రాహుల్ జట్టు కొంప ముంచాడని, అతడిలా ఆడే గిల్ కు అవకాశం ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. అతనికంటే దాటిగా ఆడే గైక్వాడ్ ను ఓపెనర్ గా ఎంపిక చేయాలని సూచిస్తున్నారు.

వారు ఏం పొడిచారని
ఇక శ్రీలంకలో జరిగిన తొలి టీ20 లో టాస్ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 46 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్ లోనే గిల్ ఎల్ బీ డబ్ల్యూ గా ఔట్ అయ్యాడు. తీక్షణ బౌలింగ్ ను అంచనా వేయలేకపోయిన అతడు వికెట్ల ముందు దొరికి పోయాడు.. అనంతరం క్రీజులో కి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ బౌండరీ తో దూకుడు కనబరిచాడు. అదే జోరులో కరుణ రత్న బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రాకరాక వచ్చిన అవకాశాన్ని సంజు శాంసన్ వినియోగించుకోలేకపోయాడు.