
Gujarat Giants vs Delhi Capitals: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ జెయింట్స్ జట్టు 11 పరుగులతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గి ప్లేఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 147/4 స్కోరు చేసింది. లారా వొల్వార్ట్ (45 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 57), ఆష్లే గార్డెనర్ (33 బంతుల్లో 9 ఫోర్లతో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో మెరిశారు. హర్లీన్ డియోల్ (31) పర్లేదనిపించింది. అనంతరం ఢిల్లీ 18.4 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌటైంది. మరిజానె కాప్ (36), అరుంధతి రెడ్డి (17 బంతుల్లో 4 ఫోర్లతో 25) రాణించారు. గార్త్, తనూజ, గార్డెనర్ రెండేసి వికెట్లు తీశారు. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన గార్డెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది.
వికెట్లు టపటపా
ఛేదనలో ఢిల్లీ స్టార్ షఫాలీ (8) విఫలమైనా.. కెప్టెన్ మెగ్‌లానింగ్, అలైస్ కాప్సీ ధనాధన్ షాట్లతో చెలరేగారు. అయితే స్నేహ్ రాణా తన తొలి ఓవర్లో లానింగ్ (18)ను ఎల్బీడబ్ల్యూ చేసి ఢిల్లీకి షాకివ్వగా, కాప్సీ (22) రనౌటవడంతో పవర్ ప్లేలో క్యాపిటల్స్ 51/3తో నిలిచింది. కొద్దిసేపటికే కీలకమైన జెమీమా వికెట్‌ను గార్త్ తీసింది. అయితే వరుస వికెట్లు పడినా తగ్గని కాప్..మాన్సీ బౌలింగ్‌లో 4,4, రాణా బౌలింగ్‌లో మరో బౌండ్రీ బాదింది. 11వ ఓవర్లో హర్లీన్..జొనాసెన్‌ను పెవిలియన్ చేర్చి గుజరాత్‌కు మరో కీలక బ్రేక్ ఇచ్చింది. ఆపై తానియా, కాప్, రాధా యాదవ్ పెవిలియన్ చేరారు.

అరుంధతి రెడ్డి ఆడినా..
ఈ దశలో తెలుగు క్రికెటర్ అరుంధతి రెడ్డి చక్కటి షాట్లతో గుజరాత్ గుండెల్లో గుబులు రేపింది. హర్లిన్, రాణా బౌలింగ్‌లలో ఫోర్లు కొట్టిన ఆమె.. గార్త్ బౌలింగ్‌లో మరో బౌండ్రీ దంచి మ్యాచ్‌ను గెలిపించేలా కనిపించింది. కానీ గార్త్ బంతికి ఆమె అవుటవడంతో ఢిల్లీ ఆశలు ఆవిరయ్యాయి. శిఖా పాండే (8 నాటౌట్) జతగా 9వ వికెట్‌కు అరుంధతి 35 పరుగులు (21 బంతుల్లో) జోడించింది. ఆపై పూనమ్ వికెట్‌ను గార్డెనర్ తీయడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. కాగా, లీగ్‌లో శుక్రవారం మ్యాచ్‌లకు విరామం ప్రకటిస్తున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు