
Ind Vs Aus 1st Odi 2023: ఆసీస్ పై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నెగ్గిన భారత్..వన్డే సమరానికి సిద్దమైంది. ఈ ఏడాది ఆడిన ఆరు వన్డేల్లోనూ భారత జట్టుకు ఓటమనేదే లేదు. శ్రీలంక, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లను టీమిండియా 3-0లతో క్లీన్‌స్వీప్ చేసింది. ఇప్పుడిక ఆస్ట్రేలియా వంతు.. శుక్రవారం నుంచే కంగారూలతో మరో మూడు వన్డేల సిరీస్ మొదలవుతోంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో గెలిచిన ఊపులో ఉన్న భారత్.. ఈ ఫార్మాట్‌లోనూ ప్రత్యర్థిని చిత్తు చేయాలనుకుంటోంది. ఇరుజట్ల మధ్య తొలి డే/నైట్ వన్డే వాంఖడే మైదానంలో జరుగనుంది. ఈ ఏడాది ఆఖర్లో భారత్‌లోనే వన్డే వరల్డ్‌కప్ ఉండడంతో రెండు జట్లు కూడా ఈ సిరీస్ ను ఆ మెగా టోర్నీకి సన్నాహకంగా ఉపయోగించుకోనున్నాయి. కుటుంబ కారణాలరీత్యా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ వన్డేకు దూరమవడంతో వైస్‌కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించారు. వన్డే ఫార్మాట్‌లో జట్టుకు నాయకత్వం వహించడం పాండ్యాకిదే తొలిసారి. పొట్టి ఫార్మాట్‌లో జట్టును విజయవంతంగా నడిపిస్తున్న హార్దిక్‌ను వన్డేల్లోనూ భవిష్యత్ కెప్టెన్‌గా క్రికెట్ పండితులు పరిగణిస్తున్నారు. అందుకే ఈ మ్యాచ్ అతడికీ కీలకమే. ఆసీస్ కూడా రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ లేకుండానే బరిలోకి దిగుతోంది. స్మిత్ నాయకత్వంలో చివరి రెండు టెస్టుల్లో రాణించిన విధంగానే వన్డే సిరీ్‌సలోనూ సత్తా చాటాలనుకుంటోంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న భారత్, ఆసీస్ జట్ల మధ్య ఇప్పటిదాకా 143 వన్డేలు జరిగాయి. ఇందులో 80-53తో కంగారూలదే ఆధిపత్యం. పది మ్యాచుల్లో ఫలితం తేలలేదు.
అతడి పైనే అందరి చూపు
ఆరు వన్డేలు.. మూడు శతకాలు.. 567 పరుగులు.. 113.40 సగటుతో ఈ ఏడాది ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అసాధారణ ఆటతీరుతో దూసుకెళుతున్నాడు. వరల్డ్‌కప్ ఏడాదిలో అతడి జోరు జట్టుకు బలం కానుంది. నాలుగో టెస్టులోనూ గిల్ సెంచరీ సాధించి ఊపు మీదున్నాడు. అదే జోష్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగిస్తే రోహిత్ లేని లోటు కనిపించదు. మరో ఓపెనర్‌గా ఇషాన్ ఆడనున్నాడు. కోహ్లీ శ్రీలంక, కివీస్ లతో జరిగిన వన్డేల్లో ఫామ్ చాటుకున్నాడు. ఆసీస్ తో ఆడిన 43 వన్డేల్లో విరాట్ 54.81 స్ట్రయిక్ రేట్‌తో 2,083 రన్స్ చేశాడు. ఇందులో 8 సెంచరీలున్నాయి. అయితే స్పిన్నర్ ఆడమ్ జంపాతో ఎదురయ్యే సవాల్‌ను విరాట్ ఎలా అధిగమిస్తాడనేది చూడాలి. మిడిలార్డర్‌లో సూర్యకుమార్, హార్దిక్‌లతో పాటు ఆల్‌రౌండర్లు జడేజా, అక్షర్‌లతో బ్యాటింగ్ ఆర్డర్ పటిష్ఠంగా కనిపిస్తోంది. సిరాజ్, ఉమ్రాన్, షమిలతో పేస్‌త్రయం సిద్ధంగానే ఉన్నా స్పిన్నర్ కోటాలో చాహల్‌కన్నా కుల్దీప్ యాదవ్ కు చాన్సుంది. కుల్దీప్ చివరి ఐదు వన్డేల్లో 11 వికెట్లు తీశాడు
మూడున్నర నెలలుగా..
ఆస్ట్రేలియా జట్టు గత మూడున్నర నెలలుగా వన్డేల్లో ఆడలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు కోసమే వారి సన్నాహకాలు సాగాయి. అయితే ఐదుసార్లు ప్రపంచకప్ గెలిచిన ఈ జట్టులో మ్యాచ్ విన్నర్లకు కొదువలేదు. ఓపెనర్లు హెడ్, వార్నర్‌లతో పాటు ఆల్‌రౌండర్లు మ్యాక్స్‌వెల్, గ్రీన్, స్టొయినిస్ భారీ షాట్లు ఆడడంలో ముందుంటారు. అలాగే వన్డే వరల్డ్‌క్‌పనకు ఎదురయ్యే సవాళ్లను కూడా ఈ సిరీస్ ద్వారా అర్థం చేసుకోవాలనుకుంటోంది. చివరిసారి వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో వార్నర్, ఫించ్‌ల అజేయ శతకాలతో ఆసీస్ గెలిచింది. అదే ఉత్సాహంతో ఈసారి కూడా బోణీ చేయాలనుకుంటోంది.

తుది జట్లు (అంచనా)
భారత్
గిల్, ఇషాన్, కోహ్లీ, సూర్యకుమార్, రాహుల్, హార్దిక్ (కెప్టెన్), జడేజా, చాహల్/కుల్దీప్, షమి, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.
ఆస్ట్రేలియా:
హెడ్, వార్నర్, స్మిత్ (కెప్టెన్), లబుషేన్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, స్టొయినిస్, క్యారీ, ఎబాట్, జంపా, స్టార్క్.
పిచ్ ఎలా ఉందంటే..
వాంఖడే పిచ్ సహజంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంటుంది. దీంతో భారీ స్కోర్లు ఖాయమే. అలాగే ముందు బ్యాటింగ్‌కు దిగిన జట్టు 13సార్లు గెలవగా.. ఛేజింగ్ జట్లు 14సార్లు గెలిచి దాదాపు సమాన ఫలితాల తోనే ఉంది.