Karnataka Honour killing: కూతురు తక్కువ కులం యువకుడ్ని ప్రేమించిందని సహించలేకపోయారు. చిత్రహింసలకు గురిచేశారు. ఆ యువకుడ్ని మరిచిపోవాలని ఒత్తిడి చేశారు. వినకపోవడంతో చివరకు కుమార్తెను హత్య చేశారు. కర్నాటకలోని కగ్గుండిలో వెలుగుచూసింది పరువు హత్య. షాలిని పెరియపట్నలోని ఒక కళాశాలలో సెకండ్ పీయూసీ చదువుతోంది. వొక్కళిగ సామాజిక వర్గానికి చెందిన ఈమె మంజు అనే దళిత కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడింది. అతని స్వగ్రామం పొరుగునే ఉన్న మెళ్లహళ్లి గ్రామం. వీరిద్దరి ప్రేమ సంగతి ఇరు కుటుంబాలకు తెలిసింది. అమ్మాయి కుటుంబం వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించింది.ఆ అబ్బాయితో ప్రేమ వద్దని, అతనిని మర్చిపోవాలని షాలినికి ఆమె తండ్రి గట్టిగా మందలించి మరీ చెప్పాడు. తన తల్లిదండ్రుల నుంచి తనకు హాని ఉందని షాలిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెను నెల రోజుల పాటు మైసూరులోని గవర్నమెంట్ గర్ల్స్ హోంలో ఉంచారు. ఆ తర్వాత తాము కూతురిని ఎలాంటి ఇబ్బంది పెట్టమని, ఆమెను చదివిస్తామని షాలిని తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో ఆమెను తిరిగి ఇంటికి పంపారు. ఆమెను ఇంటికి తీసుకొచ్చాక కూడా ఆ యువకుడిని మర్చిపోవాలని ఆమె తండ్రి సురేష్ (45), తల్లి ఒత్తిడి చేశారు. అయినప్పటికీ ఆ యువకుడితో షాలిని ప్రేమ కొనసాగుతుందని తెలిశాక ఆమె తండ్రిలో ఆవేశం కట్టలు తెచ్చుకుంది.
కూతురిని చంపైనా కులంలో పరువు దక్కించుకోవాలనుకున్నాడు. కూతురు నిద్రిస్తుండగా మధ్య రాత్రి 2.30 నుంచి 3 గంటల సమయంలో ఆమె గదిలోకి వెళ్లి షాలిని గొంతు పిసికి చంపేశాడు. ఆమె తల్లి కూడా కూతురు ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుంది. తన భర్త వెళ్లిపోగానే కన్న మమకారమో ఏమో గానీ ముఖంపై నీళ్లు చల్లి స్పృహలో ఉందో, లేదో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కానీ.. అప్పటికే షాలిని చనిపోయింది. ఆ తర్వాత షాలిని మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులు బైక్‌పై తీసుకెళ్లి ఆమె ప్రేమించిన యువకుడి ఇంటి దగ్గర రోడ్డు పక్కన పడేసి ఇంటికెళ్లిపోయారు. ఆ తర్వాత షాలిని తండ్రి సురేష్ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు సురేష్‌ను, అతని భార్యను అరెస్ట్ చేసి విచారించారు.
Also Read: Aadhar: అప్పుడే పుట్టిన శిశువుకు ఆధార్..
ఈ ఘటనలో మరో విషాదం ఏంటంటే.. షాలిని తన తల్లిదండ్రులు చంపేయబోతున్నారన్న విషయం ముందే గ్రహించింది. తన లవర్‌కు ఫోన్ చేసి తనను చంపేస్తారని మాట్లాడింది. ఆ కాల్ రికార్డ్ కూడా పోలీసులు విన్నారు. అంతేకాదు.. పోలీసులకు తన తల్లిదండ్రులు తనను చంపాలని చూస్తున్నారని వివరిస్తూ ఫిర్యాదు చేసేందుకు షాలిని మూడు పేజీల లెటర్ కూడా రాసింది. పెరియపట్న పోలీసులకు రాసిన ఆ లేఖ ఆమె హత్యకు గురైన అనంతరం వెలుగులోకి వచ్చింది.