Ganapati Shobhayatra 2023: పది రోజులపాటు పూజలు అందుకున్న గణపతి గంగమ్మ ఒడికి చేరుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా గణపతి నిమజ్జన ఉత్సవాల కోలాహలం నెలకొంది. రాష్ట్రంలో అతిపెద్దదయిన ఖైరతాబాద్ గణపతి విగ్రహం నిమజ్జనానికి బయలుదేరింది. అతి పెద్ద గణపతి కావడంతో పోలీసులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం స్వామివారి శోభాయాత్ర కన్నుల పండువగా జరుగుతున్నది. ఈ క్రమంలో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. అయితే ఖైరతాబాద్ గణపతి నిమజ్జన యాత్ర కంటే ఓ బుల్లి గణపతి శోభాయాత్ర నెట్టింట వైరల్ గా మారింది.
హైదరాబాదులోని ఓ ప్రాంతంలో అక్కడి అపార్ట్మెంట్ వాసులు మట్టి గణపతిని ప్రతిష్టించారు. పర్యావరణ స్పృహను అందరిలో కలిగించాలనే ఉద్దేశంతో నిమజ్జన యాత్రను సరికొత్తగా నిర్వహించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 32 బండ్లు ఏర్పాటు చేసి.. ఆ బండ్ల మీద మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించి శోభాయాత్రకు తీసుకెళ్లారు. ముందు బస్సులో ఉన్న బండిమీద ఒక ఊయల ఏర్పాటు చేసి దాని మీద ఒక బాల గణపతిని ఏర్పాటు చేశారు. ఆ ఊయలలో బాలా గణపతి ఊగుతుండగా మిగతా గణపతులు ఆయనను అనుసరిస్తున్నారు. పర్యావరణ స్పృహకు అద్దం పట్టే విధంగా ఉన్న ఈ గణపతి విగ్రహాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.
కేవలం మట్టి విగ్రహాలు మాత్రమే కాకుండా కొండపల్లి ప్రాంతం, నిర్మల్ ప్రాంతం నుంచి ప్రత్యేకంగా ఎడ్ల బండి ఆకృతిలో ఉన్న కోయబొమ్మలను తెప్పించారు. మట్టి గణపతి ముందు ఆ కొయ్య బొమ్మలను ఉంచారు. స్వాతంత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు బాలగంగాధర తిలక్ ఏ విధంగానైతే గణపతి ఉత్సవాలు నిర్వహించారో.. ఆ స్ఫూర్తిని ప్రదర్శించే విధంగా వీరు శోభాయాత్ర నిర్వహించారు. ముందు బండిని ఒక తాడుతో కొంతమంది లాగుతుండగా మిగతా బండ్లు దానిని అనుసరిస్తున్నాయి. వారు తమ అపార్ట్మెంట్ నుంచి ట్యాంక్బండ్ వరకు ఇదేవిధంగా తాడును లాగుతూ శోభాయాత్రను పూర్తి చేశారు. అనంతరం అక్కడ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేశారు. అంతేకాకుండా కొన్ని మొక్కలను నిమజ్జనం ముగిసిన తర్వాత అక్కడికి వచ్చిన భక్తులకు పంపిణీ చేశారు. కాగా ఆ అపార్ట్మెంట్ వాసుల పర్యావరణ స్పృహకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆ మట్టి గణపతి నిమర్జనం యాత్రకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.