OTT: బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా హిట్ అయితే.. మిగతా వేదికల్లో కూడా అదే ఫలితం వస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. బాక్సాఫీస్ వద్ద రెండు రోజులకే తుస్సుమన్న సినిమాలు ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ మీద దుమ్ము లేపుతున్నాయి. తాజాగా కనిపిస్తున్న ఫలితాలే ఇందుకు ఉదాహరణ. ఆ మధ్య అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి తిరిగి రాలేదు. అదే సినిమా ఓటీటీల్లో రికార్డులు సృష్టిస్తోంది. నాన్ ఇంగ్లీష్ కేటగిరిలో గత నాలుగు వారాలుగా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. కోట్ల కొద్ది వ్యూస్ తో సందడి చేస్తోంది.. బహుశా ఈ స్థాయిలో ఫలితాన్ని అమీర్ ఖాన్ కూడా ఊహించి ఉండడు.

ఎందుకు ఈ మార్పు
లాల్ సింగ్ చద్దా మాత్రమే కాదు చాలా సినిమాలది ఇదే దారి. బ్రహ్మాస్త్ర, గంగు భాయ్, వార్, ఇంకా మిగతా సినిమాలు కూడా ఓటీటీ లో దుమ్మురేపుతున్నాయి.
కోవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి.. పైగా రకరకాల ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. అందులో రకరకాల సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి.. అయితే థియేటర్ లో సినిమాలు చూసేందుకు వెళితే నిలువు దోపిడీ అవుతోంది. దీని గురించి నటించిన హీరో, సినిమా నిర్మించిన నిర్మాత, సినిమా తీసిన దర్శకుడు మాట్లాడక పోయినప్పటికీ… ఆ దోపిడి భారాన్ని మోసేది ప్రేక్షకుడే కాబట్టి అంత ఖర్చు పెట్టి సినిమా చూడటం అవసరమా అనే ఆలోచన అంతర్మథనంలో పడేస్తోంది. ఫలితంగానే సినిమాలు థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు అంతగా ఇష్టపడటం లేదు. ఇలాంటి కారణాలవల్ల థియేటర్లలో ప్లాప్ అయిన సినిమాలు కూడా ఓటీటీలో దుమ్ములేపుతున్నాయి.
ధరలు మారొచ్చు
థియేటర్లలో సూపర్ హిట్ అయిన సినిమాలు ఓటీటీలో అంతగా ఆడటం లేదు. ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆర్ఆర్ఆర్, కేజీ ఎఫ్ తప్ప ఏ సినిమాలు కూడా ఓటీటీలో అంతగా హిట్ కాలేదు. పెద్దగా వ్యూస్ కూడా సాధించలేదు. ఓటిటి ప్లాట్ ఫామ్ లు ఎన్నెన్నో లెక్కలు చెబుతాయి గాని అందులో వాస్తవం అనేది చూసే ప్రేక్షకులకే తెలుస్తుంది. అయితే థియేటర్లలో విజయం సాధించిన సినిమాలను మాత్రమే ఓటీటీ సంస్థలు భారీ ధరకు కొనుగోలు చేస్తాయి. అయితే అలా థియేటర్లలో హిట్ అయిన సినిమాలు ఓటీటీలో అంతగా విజయం సాధించడం లేదు.

ఇది కేవలం ఓటీటీలకు మాత్రమే పరిమితం కావడం లేదు. బుల్లితెరలో కూడా అదే ఫలితం కనిపిస్తోంది. టిఆర్పి రేటింగులు 9కి మించి నమోదు కాకపోవడం మారిన ప్రేక్షకుల అభిరుచిని తెలియజేస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ ఆమధ్య మాటీవీలో ప్రసారమైనప్పుడు 9 లోపే రేటింగ్ సాధించింది. జీ తెలుగులో కేజిఎఫ్ 2 ప్రసారమైనప్పుడు 8లోపే రేటింగ్ వచ్చింది. సాధారణంగా 9_8 మధ్యలో రేటింగ్ రెండు లేదా మూడోసారి టెలికాస్ట్ అయ్యే సినిమాలకు వస్తుంది.. కానీ వరల్డ్ ప్రీమియర్ గా విడుదలయ్యే సినిమాలకు అంత పూర్ రేటింగ్ రావడం నిజంగా ఆశ్చర్యకరమే. అయితే ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా ఇచ్చిన ఫలితంతో మునుముందు ఓటీటీ సంస్థలు మనసు మార్చుకుంటాయేమో వేచి చూడాలి. పరిస్థితులు మారితే ప్లాప్ సినిమాలు కూడా భారీ ధరకు అమ్ముడుపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.