
Guntur: ప్రేమిస్తున్నానని చెప్పాడు. బంధువులకు పెళ్లాం అని పరిచయం చేశాడు. త్వరలో పెళ్లి చేసుకుందాం అని చెప్పాడు. సీన్ కట్ చేస్తే బస్టాండ్ లో వదిలి పెట్టాడు. పిలిస్తే పలకనంత దూరం.. ఫోన్ చేస్తే కలవనంత దూరం పారిపోయాడు. చివరికి మోసగాడిలా మిగిలిపోయాడు. పోలీసు రికార్డులకెక్కాడు. త్వరలో ఊచలు లెక్కబెట్టబోతున్నాడు.
గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన ఓ యువతి విజయవాడలోని బీసెంట్ రోడ్డులో ఓ బట్టల దుకాణంలో పనిచేసేది. ఆమెకు రమేష్ బాబు అనే యువకుడు ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. ప్రేమించానని చెప్పాడు. మొదట్లో ఆమె ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆమె గుంటూరు జిల్లా సూర్యారావుపేట ఆస్పత్రిలో చేరింది. రమేష్ బాబు అక్కడికి కూడా వెళ్లాడు. ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. దీంతో ఆమె అతని ప్రేమకు ఒప్పుకుంది. అప్పటికే ఆ యువతికి పెళ్లయింది కానీ విడాకులు తీసుకుని జీవిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు రమేష్ బాబు పరిచయమయ్యాడు.
గత నెల 14న గుంటూరు బస్టాండ్ సమీపంలోని తనకు తెలిసిన వారింటికి రమేష్ బాబు.. ఆ యువతిని తీసుకెళ్లాడు. తన భార్య అంటూ పరిచయం చేశాడు. వారింట్లోనే రెండు రోజులు ఉన్నారు. ఆ రెండు రోజులు శారీరకంగా దగ్గరయ్యారు. ఆ తర్వాత జనవరి 16న ఆమెను విజయవాడలో వదిలేశాడు. కంటికి కనిపించకుండా వెళ్లిపోయాడు. ఫోన్ చేసినా కలవలేదు. అతని ఆచూకీ ఆమెకు తెలియదు. దీంతో ఆమె మోసపోయినట్టు గ్రహించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు పై సూర్యారావు పేట పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువతి సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడే కేసు నమోదు చేశారు. నిందితుడి పై అత్యాచారం, మోసం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రమేష్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆన్ లైన్ లావాదేవీల్లోనే కాదు.. ఆన్ లైన్ ప్రేమల్లోను మోసముందని రమేష్ బాబు మరోసారి నిరూపించారు.