Francoise Bornet Kiss Photo: ఇప్పుడంటే సోషల్ మీడియా రోజులు కాబట్టి.. ఏ చిన్న సంఘటన జరిగినా చర్చనీయాంశమవుతోంది. బుల్లెట్ బండి పాటకు ఓ వధువు డాన్స్ వేసినా, కుర్చీ మడతపెట్టి అంటూ ఓ వృద్ధుడు మాట్లాడినా, కేమర వట్టిండే సీమ దసరా చిన్నోడు అని పాట పాడినా.. జనాలకి అత్యంత వేగంగా రీచ్ అవుతున్నాయి. వాటి వెనుక ఉన్న వ్యక్తులను ఓవర్ నైట్ స్టార్ ను చేస్తున్నాయి.. కానీ సోషల్ మీడియా లేని కాలంలో.. కేవలం ఇద్దరు ప్రేమికులు దిగిన ఒకే ఒక ఫోటో వారిని రాత్రికి రాత్రే సెలబ్రిటీలను చేసింది. వారు దిగిన ఫోటోను తమ గోడలకు వేలాడదీసుకునేలా చేసింది.. అంతేకాదు వివిధ వ్యాపార సంస్థలు కూడా ఆ ఫోటోను వాడుకునేలా చేసింది.. ఇంతకీ ఆ ఫోటో తీసింది పికాసో కాదు, రవి వర్మ అంతకన్నా కాదు.. ఇంతకీ ఏమిటి ఆ ఫోటో.. దాని వెనుక ఉన్న నేపథ్యంలో ఒకసారి తెలుసుకుందాం పదండి.
అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరూ పట్టించుకోరు. జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. అని ఖలేజా సినిమాలో రావు రమేష్ అంటూ ఉంటాడు కదా.. ఇలాంటి డైలాగే ఆ ఇద్దరి ప్రేమికుల నిజ జీవితంలో జరిగింది. అది 1950 కాలం.. ఆ యువతి పేరు ఫ్రాంకోయిస్ బోర్నెట్ వయసు ఓ 25 సంవత్సరాల దాకా ఉంటాయి. స్థానికంగా ఉన్న ఓ యువకుడితో ఆమె ప్రేమలో ఉంది. ఆమె ఉండేది పారిస్ లో.. వ్యక్తిగత స్వేచ్ఛకు పర్యాయపదం లాంటి ఆ దేశంలో బహిరంగంగా చుంబనాలు పెట్టుకోవడం పెద్ద నేరమేమి కాదు.. హోటల్ డీ విల్లే దగ్గర వారిద్దరూ కలుసుకున్నారు. చాలా కాలం తర్వాత ఒకరికి ఒకరు తారసపడటంతో ప్రేమను వ్యక్తపరుచుకునే క్రమంలో.. ఒకరికొకరు చుంబించుకున్నారు. దానిని ఓ ఫోటోగ్రాఫర్ తీశాడు. దీంతో ఆ ఫోటో అత్యంత సహజంగా ఉండటంతో దెబ్బకు పాపులర్ అయింది.
వివిధ వ్యాపార సంస్థలు ఆ ఫోటోను తమ ప్రకటనల కోసం వాడుకున్నాయి. ప్యారిస్ లోని యువత ఆ ఫోటోను తమ గోడలకు అంటించుకున్నాయి. అయితే వ్యాపార సంస్థలు ఈ ఫోటోలను విరివిగా వాడుతున్న నేపథ్యంలో చాలా మంది యువకులు ఆ ఫోటోలో ఉన్నది తామే అంటూ ముందుకు వచ్చారు. చివరికి బోర్నెట్ ఆ ఫోటోలో ఉంది తాను, తన ప్రియుడు అని చెప్పి… ఆ ఫోటోగ్రాఫర్ సంతకంతో కూడిన ఒరిజినల్ ఫోటోను వ్యాపార సంస్థల ప్రతినిధులకు చూపించింది. ఇది 1980 సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత అంటే దాదాపు 25 సంవత్సరాల కు ఆ ఫోటోను వేలం వేయగా 1.30 కోట్ల ధర పలికింది. ఎప్పుడో 1950లో తీసిన ఫోటో అంత ధర పలకడం అంటే మామూలు విషయం కాదు. పైగా ఆ ఫోటోను దక్కించుకున్న వ్యక్తి దానిని అందమైన ఫ్రేమ్ లో బంధించి తన ఇంట్లో గోడకు వేలాడదీసుకున్నాడు. యాదృచ్ఛికంగా దిగిన ఒక ఫోటో.. అది కూడా 55 సంవత్సరాల తర్వాత 1.30 ధర పలకడం అంటే మామూలు విషయం కాదు..