Birds Divorce: “సంసారం ఒక చదరంగం. అనుబంధం ఒక రణరంగం..” సంసారం గురించి, అందులో ఉండే బాధల గురించి ఓ సినీ కవి రాసిన పాట ఇది. మనుషులకంటే తప్పదు. వాళ్ళ సంగతి పక్కన పెడితే పక్షులకు కూడా ఆ సంసారం అంటే వైరాగ్యం వచ్చింది కావచ్చు. అందుకే విడాకులు తీసుకుంటున్నాయి. కుటుంబ కలహాలు మనుషులకు సహజం. అలాగే వ్యక్తిగత కలహాలు పక్షులకు కూడా సహజమే. కానీ చిన్నచిన్న తగాదాలతో పక్షులు విడిపోతున్నాయి. దీనికి కారణం కూడా మనుషులే అని శాస్త్రవేత్తలు తేల్చపడేశారు. చదివేందుకు విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం. ఇటీవల చైనా దేశంలో 232 రకాల పక్షులపై సన్ యేట్ సేన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు జరిపారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మొత్తం 100 పక్షి జంటలపై వారు రకరకాల పరిశోధనలు జరిపారు. వీటిల్లో 10 శాతం పక్షులు తమ సహజీవనాన్ని వదులుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇంతకీ ఏం తేలిందంటే..
రుతువుల ఆధారంగా పక్షులు వలస వెళ్తాయి. ఆహార అన్వేషణలో భాగంగా కూడా చాలా దూరం ప్రయాణిస్తాయి.. అయితే అలా వలస వెళ్లిన పక్షులు తిరిగి స్వస్థలాలకు చేరుకున్నప్పుడు పాత భాగస్వాములతో వీడిపోతున్నాయి. ఇదే సమయంలో కొత్తవాటితో జతకడుతున్నాయి. కొన్ని పక్షులు తమ సహచరితో విడిపోయిన తర్వాత ఒంటరిగానే జీవితం గడుపుతున్నాయి. మరికొన్ని మాత్రం కొత్త భాగస్వామి కోసం తెగ వెతుకుతున్నాయి.
ఇవీ కారణాలు
పక్షులు ఇలా ప్రవర్తించేందుకు కారణం మనుషులు. విచక్షణారహితంగా చెట్లను నరకడం, కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు పెరిగిపోవడం, కొత్త నగరాలు పుట్టుకు రావడం వల్ల పక్షుల ఆవాసాలు కుంచించుకుపోతున్నాయి. ఇవి పక్షుల సహజీవనం పై ప్రభావం చూపిస్తున్నాయి. ఆహారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లడం కూడా పక్షుల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు వివిధ రకాల వాతావరణ పరిస్థితులను పక్షులు నేరుగా ఎదుర్కొంటాయి.

ఇవి పక్షుల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తోందని ఆస్ట్రేలియాలోని న్యూ ఇంగ్లాండ్ యూనివర్సిటీకి చెందిన ఆర్నిథాలజిస్ట్ జీసెలా కప్లాన్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. కొన్నిసార్లు పక్షుల ఆరోగ్యం దెబ్బతిని తిరిగి తన భాగస్వామిని చేరుకోవడం కష్టమైపోతుంది. ఆహార సేకరణ, సంతానోత్పత్తికి నిరాకరణ వంటి సందర్భాల్లో కూడా పక్షులు విడిపోతున్నట్టు తెలిసింది. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు నిర్వేదంగా ఉండే పక్షులు.. జంటగా ఉన్నప్పుడు మాత్రం ఉత్సాహంగా ఉన్నట్టు గమనించారు. మొత్తానికి సంసారం మనుషులనే కాదు పక్షులని కూడా ఇబ్బంది పెడుతోంది.