
AP Budget 2023- 24: ఎన్నికల ఏడాది కావడంతో వైసీపీ సర్కారు కీలక నిర్ణయాలు దిశగా అడుగులేస్తోంది. సంక్షేమమే తనకు మరోసారి గెలిపిస్తుందని జగన్ బలంగా నమ్ముతున్నారు. అందుకే సంక్షేమ పథకాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నారు. 2.59 లక్షల కోట్ల ప్రతిపాదనలతో గురువారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ జెండర్ బెస్ట్ బడ్జెట్ గా చెబుతున్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమం, పేదల ఇళ్లు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యక కేటాయింపులు చేయనున్నారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ.. అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటనలు చేయనున్నట్టు తెలుస్తోంది.
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత ఇది ఐదో బడ్జెట్. పూర్తిగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. సంక్షేమ తారకమంత్రంతో వచ్చే ఎన్నికల్లో ఓట్లే లక్ష్యంగా అన్నివర్గాల వారికి కేటాయింపులు చేయనున్నట్టు తెలుస్తోంది. ముందుగా కేబినెట్ సమావేశంలో బడ్జెట్ ను ఆమోదించనున్నారు. తరువాత శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. దానిని అనుసరిస్తూ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను సమర్పిస్తారు. శాసనమండలిలో సాధారణ బడ్జెట్ ను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి సీదిరి అప్పలరాజు ప్రవేశపెట్టనున్నారు. అయితే బడ్జెట్ రూ.1.79 లక్షల కోట్లకు పెరిగే అవకాశముంది. గతంలో మాదిరిగా ప్రభుత్వం అదనపు కేటాయింపులకు ప్రాధాన్యత ఇచ్చే చాన్స్ ఉంది.

గత ఏడాది ఏపీ ప్రభుత్వం రూ.1,91,225 కోట్ల నికర ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది. కానీ ఆర్థిక సంవత్సరంలో..10 మాసాల్లో కేవలం రూ.1.25 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలుస్తోంది. అందుకే ఈసారి వాస్తవిక కోణంలో నికర ఆదాయం, కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటాను అంచనా వేస్తున్నట్టు సమాచారం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.41,388 కోట్ల కేంద్ర పన్నుల వాటాగా వస్తున్నట్టు అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ పాదయాత్ర చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ నవరత్నాలకు ప్రాధాన్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా కేటాయింపుల్లో అగ్రతాంబూలం నవరత్నాలదే. అమ్మ ఒడి, వైఎస్సార్ రైతుభరోసా వంటి ఆకర్షణీయమైన పథకాలకు కేటాయింపులు పెంచి రాజకీయంగా లబ్ధి పొందాలన్నది జగన్ సర్కారు ప్లాన్.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చాలారకాలుగా సమస్యలు ఉన్నాయి. చాలా నిర్ణయాలు పెండింగ్ లో పెట్టారు. కొన్నింటికి కేటాయింపులు చేసే చాన్స్ ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల సేవలు మెరుగుపరచడానికి కేటాయింపులు పెరిగే అవకాశముంది. అయితే అత్యంత ప్రాధాన్యతాంశాలుగా విద్య, వైద్యంను పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక కేటాయింపులు చేయనున్నారు. అటు రాజధాని అంశంతో పాటు సీఎం క్యాంప్ ఆఫీసు తరలింపు, పింఛన్ రూ.3 వేలు మొత్తానికి పెంపు వంటి కీలక అంశాలపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటనలు చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.