
TSPSC Paper Leak- Praveen: ఏఈ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ పెన్ డ్రైవ్ లో ఎన్ని ప్రశ్న పత్రాలు ఉన్నాయి? వీటిని ఎంతమందికి చేరవేశాడు? రేణుక లాంటివాళ్ళకు ఎంతమందికి అమ్మాడు? వీటి ద్వారా ఎంత వెనుకేశాడు? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కనుగొనే పనులు పోలీసులు పడ్డారు.. వాస్తవానికి ఏ ఈ ప్రశ్న పత్రం లీక్ తర్వాత చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట్లో ప్రవీణ్ ఒక్కడే ఈ వ్యవహారం నడిపించాడని పోలీసులు భావించారు. కానీ అతడిని విచారిస్తుండగా మరికొందరి పేర్లు బయటపడ్డాయి. ఇంకా బయట పడుతూనే ఉన్నాయి. అయితే ప్రవీణ్ ఎంతకీ నోరు విప్పకపోవడంతో..ఈ కేసులో ఏ_2 రాజశేఖర్ రెడ్డి చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు మరింత కూపీ లాగారు.
ఈ క్రమంలో ప్రవీణ్ ఫోన్, లాప్ టాప్, పెన్ డ్రైవ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న వివరాలను చూసి నోర్లు వెళ్ళబెట్టారు. ఏ ఈ మాత్రమే కాదు పలు ఉద్యోగాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు అందులో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే బయటికి మాత్రం కేవలం ఈ పరీక్ష కృష్ణ పత్రం మాత్రమే లీక్ అయిందని చెబుతున్నారు. మిగతా ప్రశ్నపత్రాలు తెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా గందరగోళ పరిస్థితి నెలకొంటుందని, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని గోప్యంగా ఉంచుతున్నట్టు సమాచారం.

కారుణ్య నియామకంతో కంత్రి పని
టీఎస్ పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌ది బడంగ్‌పేట్ కార్పొరేషన్ 19వ డివిజన్‌లోని మల్లికార్జుననగర్ కాలనీ. అతడి తండ్రి హరిశ్చంద్రరావు ప్రభుత్వ ముద్రణాలయంలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తూ విధినిర్వహణలో మరణించాడు. దాంతో ఆయన ఇద్దరు కుమారుల్లో చిన్నవాడైన ప్రవీణ్‌కు ముద్రణాలయంలోనే కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కల్పించింది. కొంతకాలం అక్కడ పనిచేసిన తర్వాత 2017లో టీఎస్ పీఎస్సీకి బదిలీ అయ్యాడు. జూనియర్ అసిస్టెంట్‌గా నాలుగేళ్లపాటు గ్రౌండ్ ఫ్లోర్‌లో పనిచేసిన ప్రవీణ్.. ఏడాది క్రితం సెక్షన్ ఆఫీసర్‌గా పదోన్నతి పొంది కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా ఎదిగాడు. అందులో పరిచయాలు పెంచుకున్నాడు. లొసుగులను తెలుసుకుని సంపాదన మొదలు పెట్టాడు.
గ్రూప్-1 కూడా లీకయిందా?
టీఎస్‌పీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నపత్రాన్ని లీక్ చేసిన టీఎస్ పీఎస్సీ ఉద్యోగి పులిదిండి ప్రవీణ్‌కుమార్ గ్రూప్-1 పరీక్ష రాశాడు. ఇందులో అతడికి 103 మార్కులు వచ్చాయి ఈ పరీక్ష పేపర్ కూడా లీకైందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రవీణ్ తమ అనుమతి తీసుకొని పరీక్ష రాశాడని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ పరీక్షలో మొత్తం 150 మార్కులకుగాను ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చాయి. అతని బుక్‌లెట్ కోడ్ ఆధారంగా పోలీసులు కీ పేపర్‌ను పరిశీలించగా ఈ విషయం వెల్లడయింది. ఇన్ని మార్కులు వచ్చినా మెయిన్స్‌కు అతడు డిస్‌క్వాలిఫై అయ్యాడు. ప్రాథమిక సమాచారం (బుక్‌లెట్ కోడ్, హాల్‌టికెట్ నంబర్) నింపే క్రమంలో బబ్లింగ్ సరిగా చేయకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు తదితర సమాచారం ప్రవీణ్ మొబైల్ ఫోన్‌లో దొరికింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పేపర్ లీకైందన్న అనుమానాలకు ఇదే కారణమవుతోంది.