
AP Politics: తాను దూరడానికి సందు లేదు కానీ.. మెడకు ఒక డోలా అన్న సామెత తెలుగునాట బహుళ ప్రాచుర్యంలో ఉంది. తన స్థాయికి మించి ఆలోచన చేసినప్పుడు, మాటలు చెప్పినప్పుడు ఈ సామెతను వాడుతుంటారు. ఇప్పడు ఏపీ రాజకీయాలకు ఈ సామెత అతికినట్టు సరిపోతోంది. గత ఎన్నికల్లో 151 స్థానాలు.., ఆపై వరుస ఎన్నికల్లో విజయం, విపక్షాల నుంచి ఐదుగురు శాసనసభ్యులు గూటికి చేరడంతో అధికార వైసీపీలో అంతులేని ఆత్మవిశ్వాసం పెంచింది. ఎన్నికలు ఏవైనా? ఎప్పుడైనా? విజయం తమదేనని.. క్లీన్ స్వీప్ చేస్తామంటూ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. చివరకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంను సైతం గెలిచేస్తామంటూ చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో వైనాట్ 175 అన్న స్లోగన్ ను వైసీపీ శ్రేణుల్లోకి వదిలారు. ఇప్పుడది బలంగా వెళ్లింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అదే స్లోగన్ ను వైసీపీకి తీప్పికొడుతోంది టీడీపీ. దీంతో రెండు పార్టీల మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి.
ఏకపక్ష విజయాలు తరువాత..
ఆ మధ్యన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా పరాజయం పాలైంది. మునిసిపల్ ఎన్నికల్లో రెండోచోట్లే విజయం సాధించింది. చివరకు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంను సైతం ఎగురేసుకుపోయింది. దీంతో వైసీపీలో సంబరాలు మిన్నంటాయి. టీడీపీలో నిరాశ అలుముకుంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ చంద్రబాబును టార్గెట్ చేసుకున్నారు. కుప్పంలో ఓటమి ఎదురుకావడంతో ఒకసారి చంద్రబాబు ముఖం చూడాలని ఉందని శాసనసభలో టీడీపీ శాసనసభ్యుల వద్ద వ్యాఖ్యానించారు. సరిగ్గా అప్పటి నుంచి ఇంటా బయట జగన్ ఒకటే మాట చెప్పుకుంటూ వస్తున్నారు. వైనాట్ 175 అన్న స్లోగన్ ఇస్తూ వస్తున్నారు. చంద్రబాబు కుప్పంను సైతం చేజిక్కించుకుంటామని చెబుతున్నారు.
తిప్పికొడుతున్న టీడీపీ…
అయితే మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ జగన్ వైనాట్ 175 మాట వినిపించింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ పుంజుకుంది. నాలుగు స్థానాలను గెలుచుకొని అధికార పార్టీకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ముఖ్యంగా వైసీపీకి కీలకంగా భావించే రాయలసీమలో సైతం గెలుపొంది సవాల్ చేసింది. రాజకీయ సమీకరణలనే మార్చేసింది. వైనాట్ పులివెందుల అన్న స్లోగన్ తో ముందుకు సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే విజయమని ఊరూ వాడా ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సైతం వైనాట్ 175 అన్న ప్రకటన చేశారు. అందరం కలిసి వైసీపీకి ఒక్కస్థానం కూడా దక్కకుండా ఓడిస్తామని ప్రకటించారు. దీంతో తేనె తుట్ట కదిలింది. దీనిపై వైసీపీ ధీటైన కౌంటర్ ఇస్తోంది. అందరూ కలిసి కాదు..ఒక్కరే రండి అంటూ సవాల్ చేస్తోంది. ఇప్పుడు ఏపీలో ఇదే పొలిటికల్ హీట్ పెంచుతోంది.

ఇందులో వాస్తవమెంత?
ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార, విపక్షాలకు 175 స్థానాలకు 175 వచ్చే చాన్స్ లేదు. గత ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ 151 స్థానాలను దక్కించుకుంది. అన్ని స్థానాలు వస్తాయని ఆ పార్టీకి కూడా నమ్మకం లేదు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే లేదనే సమాధానం వినిపిస్తుంది. వైసీపీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అదే స్పష్టమైంది. అలాగని టీడీపీకి ఏకపక్షంగా ఫలితాలు వస్తాయంటే.. దానికి చాన్స్ లేదు. పవన్ తో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారు. బీజేపీ రాకుంటే వామపక్షాలను కలుపుకెళ్లేందుకు సిద్ధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇటువంటి సమయంలో 175 నియోజకవర్గాలకు 175 అన్న ప్రకటన వాస్తవ విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయాల్లో భాగంగా చేసిన వ్యాఖ్యలే కానీ.. సాధ్యం కాదని తేల్చేస్తున్నారు.