
Earthquake In Turkey And Syria: టర్కీ, సిరియాలను భూకంపం వణికించింది. వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. భూకంప ధాటికి భవనాలు పేక మేడల్లా కూలిపోయాయి. దీంతో సహాయక చర్యలు ముమ్మరం చేసినా శిథిలాల కింద వందలాది శవాలు బయట పడుతూనే ఉన్నాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకృతి ప్రకోపానికి రెండు దేశాలు భయాందోళన చెందుతున్నాయి. బిక్కుబిక్కుమంటూ సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ప్రపంచ బ్యాంకుతో పాటు పలుదేశాలు సాయం అందిస్తున్నాయి. దీంతో సహాయక చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో శిథిలాల తొలగింపు యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. అక్కడ కనిపిస్తున్న శవాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సిరియాలోని ఇడ్లిబ్ నగరంలో సహాయ చర్యలు చేపడుతున్న సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న ప్రాణాలతో ఉన్న ఓ చిన్నారిని కాపాడారు. దీంతో ఆమె మృత్యుంజయురాలుగా ఉండటంతో సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు. ఆమెను ఎత్తుకుని ముద్దాడారు. ఇలా ఎందరో అభాగ్యులు భూకంప ధాటికి కుప్పకూలి పోవడంతో ఎటు చూసినా హృదయ విదారకర దృశ్యాలే కనిపిస్తున్నాయి. భూకంప జోన్ లో ఉన్న దేశాలు కావడంతో తరచూ భూకంపాలు రావడం సహజమే. కానీ వందేళ్లలో ఇంతటి ఘోర విపత్తు రాలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
పూర్వం 1939లో వచ్చిన భూకంపంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన జరిగింది. మళ్లీ ఇప్పుడు అంతటి స్థాయిలో ఉత్పాతం జరగడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. చేయని తప్పుకు శిక్ష అనుభవించినట్లు ఏ పాపం ఎరుగని అమాయక జనం తమ ప్రాణాలు కోల్పోయారు. ఇదివరకే ఓ ఘటనలో ఓ చిన్నారిని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు పోగొట్టుకున్న తండ్రి ఉదంతం మరవక ముందే ఈ పాప ప్రాణాలు కాపాడిన తీరు అందరిలో హర్షం వ్యక్తమైంది.

ప్రపంచ బ్యాంకుతో పాటు చాలా దేశాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. టర్కీ, సిరియాలకు తమకు తోచిన సాయం అందజేస్తున్నాయి. సహాయక చర్యల్లో కూడా పాలు పంచుకుంటున్నాయి. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు అయ్యో పాపం అంటున్నారు. వారి దయనీయ స్థితికి బాధ పడుతున్నారు. ఎవరికి రాని కష్టం వారికి వచ్చిందని విచారం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రెండు దేశాలు కోలుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. దానికి అందరం చేయూతనిద్దాం. మనవంతు సాయం చేద్దాం.