https://oktelugu.com/

Nalgonda: నాకు అన్నంపెట్టేవారు లేరు.. వేసవి సెలవులు ఇవ్వకండి.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాలుడి లేఖ

పిల్లలంతా హాఫ్‌డే స్కూల్స్‌తోపాటు వేసవి సెలవులు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. కానీ, ఆ విద్యార్థి మాత్రం సెలవులు వద్దని తన నోట్‌బుక్‌లో రాసుకున్నాడు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : March 8, 2024 / 04:17 PM IST

    Nalgonda

    Follow us on

    Nalgonda: విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. మరోవైపు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో పాఠశాలలను ఒంటిపూట నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 15 నుంచి హాఫ్‌ డే స్కూల్స్‌ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 నుంచి 12:30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాని పేర్కొంది. 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని తెలిపింది.

    సెలవులు వద్దు ప్లీజ్‌..
    పిల్లలంతా హాఫ్‌డే స్కూల్స్‌తోపాటు వేసవి సెలవులు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. కానీ, ఆ విద్యార్థి మాత్రం సెలవులు వద్దని తన నోట్‌బుక్‌లో రాసుకున్నాడు. అందరూ సెలవులు వస్తున్నాయని సంతోషపడుతుంటే అతను మాత్రం బాధపడుతున్నాడు. తన బాధను మొత్తం నోట్‌బుక్‌లో రాసుకున్నాడు. ఆ లేఖ ఉపాధ్యాయుడి కంట పడింది. అది చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఉపాధ్యాయుడు ఆ లేఖను సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆలేఖ చదివిన వారందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.

    లేఖలో ఏముందంటే..
    ‘సార్‌.. వేసవి సెలవులు ఇవ్వకండి.. నేను ఇంటికి వెళితే నాకు అన్నం పెట్టేవారు లేదు. అమ్మమ్మ పింఛన్‌ పైసలతోనే బతుకుతుంది. నానమ్మకు కాళ్లు విరిగాయి. నాన్న పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నడు. అమ్మ హైదరాబాద్‌లో ఉంటుంది. నాకు ఇంటికి వెళ్లాలని లేదు. బడిలోనే ఉంటాను అన్నం పెట్టండి. పాఠాలు చెప్పండి. బాగా చదువుకుని ఐఏఎస్‌ అవుతా’ అంటూ అందులో తన కష్టాలను వివరిస్తూ రెండు పేజీల వరకు రాసుకున్నాడు. ఈ లేఖ పాఠశాల ఉపాధ్యాయుడి కంటపడింది. దానిని చదివిన ఉపాధ్యాయుడు చలించిపోయాడు. ఆ లేఖను ఇతర ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు బాలుడిని పిలిచి మాట్లాడారు. అతని పరిస్థితి తెలుసుకు బాధపడ్డారు. దాతల సాయం కోరుతూ లేఖను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్‌ అవుతోంది.

    ఎవరీ బాలుడు..
    నల్లగొండ జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకులంలో 8వ తరగతి చదువుతున్నాడు సాత్విక్‌. ఐదో తరగతి వరకు అమ్మమ్మ వాళ్ల ఊళ్లో చదువుకున్నాడు. తర్వాత కరోనా కారణంగా సెలవులు రావడంతో పాఠశాలకు వెళ్లలేదు. కరోనా తర్వాత తన తండ్రి వద్దకు వెళ్లాడు. నానమ్మ దగ్గర ఉంటూ నేరుగా 7వ తరగతిలో చేరాడు. అక్కడ మిత్రులు జ్యోతిబాపూలే గురుకుల పరీక్ష రాయాలని చర్చించుకోవడం విని పరీక్ష రాశాడు. సీటు సాధించాడు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు.

    ఇదీ కుటుంబ నేపథ్యంలో
    సాత్విక్‌ రెండేళ్ల వయసులోనే అతని తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి తాగుడు కారణంగా సాత్విక్‌ అనాథ అయ్యాడు. తల్లి మరో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. సాత్విక్‌ అమ్మమ్మ దగ్గర ఉంటూ ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత తండ్రి వద్దకు వెళ్లాడు. అక్కడ 7వ తరగతి చదివాడు. అక్కడ అమ్మమ్మ, ఇక్కడ నానమ్మ వృద్దులే. వారినే మరొకరు చూసుకోవాలి. ఈ పరిస్థితిలో ఒంటరితనానికి అలవాటుపడిన సాత్విక్‌ చదువుపైనే దృష్టిపెట్డాడు. ఉన్నత చదువులు చదవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అదే సమయంలో ఆట పాటల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు.

    ఏక సంతాగ్రహి..
    సాత్విక్‌కు మంచి టాలెంట్‌ ఉందని పాఠశాల ఉపాధ్యాయులు స్వయంగా చెబుతున్నారు. ఏం చెప్పినా ఒక్కసారికే గ్రహిస్తాడని, తన అనుమానాలు నివృత్తి చేసుకుంటాడని చెబుతున్నారు. ఇంతటి టాలెంట్‌ ఉన్న విద్యార్థి సెలవులు వద్దని తన పుస్తకంలో రాసుకోవడం అందరినీ కదిలిస్తోంది. ఎవరైనా దాతలు ఉండి అతడికి సాయం చేస్తే భవిష్యత్‌లో మంచి స్థాయికి ఎదుగుతాడని ఉపాధ్యాయులు కోరుతున్నారు.

    స్పందిస్తున్న నెటిజన్లు..
    సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సాత్విక్‌ లేఖను చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు. అతడికి సాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. కొందరు సాత్విక్‌కు మంచి భవిష్యత్‌ ఉందని, గొప్పవాడు అవుతాడని, కావాలని ఆకాంక్షిస్తున్నారు.