
మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళా డాక్టర్ భర్త మరియు ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. జీవితంపై నిరాశతోనే డాక్టర్ కుటుంబ సభ్యులను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వివరాల్లోకి వెళితే 41 సంవత్సరాల డాక్టర్ స్సుష్మారాణే ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేసే భర్త ధీరజ్ తో కలిసి జీవించేది. వీళ్లకు ఇద్దరు సంతానం. డాక్టర్ సుష్మ మొదట భర్త, ఇద్దరు పిల్లలకు మత్తుమందు కలిపిన ఆహారాన్ని ఇచ్చింది. ఆహారం తిన్న కుటుంబ సభ్యులు స్పృహ కోల్పోయిన తరువాత వారికి విషంతో కూడిన ఇంజక్షన్ ఇచ్చి హతమార్చింది. అనంతరం సుష్మారాణే మరో గదిలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. సంఘటన స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ తో పాటు రెండు సిరంజీలు దొరికాయి. బ్రతకాలన్న ఆశ లేకపోవడం వల్లే భర్త, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు సుష్మా సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. పోలీసులు నాలుగు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ కేసు గురించి డాక్టర్ సుష్మా స్నేహితులను, ఆస్పత్రి సిబ్బందిని, ఇరుగుపొరుగు వారిని విచారిస్తున్నారు.