
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఆన్ లైన్ ఫార్మసీ రంగంలోకి అడుగుపెట్టారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా నెట్‌మెడ్స్‌లో మెజారిటీ శాతం వాటాను కొనుగోలు చేసింది. ఆర్.ఐ.ఎల్ నెట్ మెడ్స్ లో 60 శాతం వాటాను 620 కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. రిలయన్స్ జియో తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఈ కామర్స్ రంగంలో ఔషధ విభాగంలోకి సైతం అడుగు పెట్టడానికి వీలు కలిగింది.
ఇప్పటికే రిలయన్స్ జియోమార్ట్ పేరుతో ఆన్ లైన్ గ్రాసరీ ఫ్లాట్ ఫామ్ ను నిర్వహిస్తోంది. విశ్లేషకులు రిలయన్స్ ఇండస్ట్రీస్ డీల్ ప్రకారం నెట్ మెడ్స్ విలువ 1000 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం గత వారం ఔషధ విక్రయాలను ప్రారంభించింది. ప్రస్తుతం బెంగళూరులో అమెజాన్ ఆన్ లైన్ ద్వారా ఔషధాలను విక్రయిస్తోంది. త్వరలో భారతదేశమంతటా అమెజాన్ ఔషధాలను విక్రయించబోతున్నట్లు తెలిపింది.
నెట్ మెడ్స్ కొనుగోలుతో రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెజాన్ తో పోటీ పడబోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఇప్పటికే మెడ్ లైఫ్, ఫార్మ్ ఈజీ, నెట్మెడ్స్, ఇతర కంపెనీలు ఆన్ లైన్ ద్వారా ఔషధ విక్రయాలు చేపడుతున్నాయి. ప్రదీప్ ధాధా అనే వ్యక్తి నెట్ మెడ్స్ అనే కంపెనీని ఏర్పాటు చేసి ఆన్ లైన్ ద్వారా ఔషధాలు విక్రయించేలా ఏర్పాటు చేశారు. ప్రదీప్ ధాధా సంవత్సర కాలంగా మంచి ధర లభిస్తే వ్యాపారాన్ని విక్రయించాలని ఆలోచిస్తుండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా నెట్ మెడ్స్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది.