
Richa Pallod: బ్లాక్ బస్టర్ ఎంట్రీ అతికొద్ది మంది హీరోయిన్స్ కి మాత్రమే దక్కుతుంది. అలాంటి లక్కీ హీరోయిన్స్ లో రిచా ఒకరు. 2000 సంవత్సరంలో విడుదలైన నువ్వేకావాలి ఒక సంచలనం. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్స్ హీరో హీరోయిన్ గా ఆ చిత్రంతో పరిచయమయ్యారు. ఒకరు తరుణ్ కాగా మరొకరు రిచా. తరుణ్ స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ పదుల సంఖ్యలో చిత్రాలు చేశాడు. అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఇక రిచా రెండు హిందీ చిత్రాల్లో బాలనటిగా నటించారు. నువ్వే కావాలి హీరోయిన్ గా డెబ్యూ చిత్రం.
ఉషా కిరణ్ బ్యానర్ లో డైరెక్టర్ కే విజయభాస్కర్ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ చేయాలనుకున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ డైలాగ్స్ అందించారు. చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ గా పెరిగిన అమ్మాయి-అబ్బాయి మధ్య జరిగే రొమాంటిక్ డ్రామా. ఈ కథకు ఫ్రెష్ ఫేసెస్ బెటరని భావించిన దర్శకుడు ఆడిషన్స్ పెట్టి తరుణ్-రిచాలను ఎంపిక చేశారు. సింగర్ కమ్ యాక్టర్ సాయి కిరణ్ మరో కీలక రోల్ చేశారు. అక్టోబర్ 13న విడుదలైన నువ్వేకావాలి యూత్ కి పిచ్చెక్కించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా తెగ నచ్చేసింది. ఏడాదికి పైగా ఆడిన నువ్వేకావాలి… వారాల తరబడి హౌస్ ఫుల్ బోర్డ్స్ వెలిసేలా చేసింది. సాంగ్స్ నెలల తరబడి జనాల్లో నానాయి.

తరుణ్, రిచా ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. ఇక రిచాకు తెలుగులో వరుసగా ఆఫర్స్ వచ్చాయి. అయితే ఆమెకు విజయాలు దక్కలేదు. నువ్వే కావాలి తర్వాత మరో హిట్ పడలేదు. దీంతో కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ చిత్రాల్లో నటించారు. కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో 2011లో బెంగుళూరికి చెందిన హిమాన్షు బజాజ్ ని చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు.
పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. తెలుగులో రిచా నటించిన చివరి చిత్రం మలుపు 2016లో విడుదలైంది. అలాగే ఖాన్ నంబర్ వన్ అనే ఒక హిందీ సీరియల్ లో నటించారు. ‘యువర్ హానర్’ టైటిల్ తో తెరకెక్కిన వెబ్ సిరీస్లో కూడా రిచా నటించారు. సోనీ లివ్ లో 2020 నుండి ఇది స్ట్రీమ్ అవుతుంది. గత రెండేళ్లుగా ఆమె నటనకు దూరంగా ఉంటున్నారు. రిచా ప్రస్తుతం భర్తతో పాటు బెంగుళూరులోనే ఉంటున్నట్లు సమాచారం. రిచా పుట్టి పెరిగింది బెంగుళూరులోనే. నువ్వే కావాలి మూవీతో కుర్ర హృదయాలు కొల్లగొట్టిన రిచా… మరలా తెలుగులో సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
One attachment •