
Revanth Reddy- Errabelli Dayakar Rao: డిక్కీ బలిసి కోడి.. చికెన్‌షాప్ ముందు నిలబడి తొడగొట్టిందనేది సామెత. అచ్చం ఇలాగే టీపీసీసీ అధ్యక్షుడిగా ఎదిగిన రేవంత్‌రెడ్డి.. తన పాదయాత్రలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇలాకాలో నిలబడి తన మాజీ సహచరుడికి సవాల్ విసిరారు. ఏడేళ్ల క్రితం వరకూ ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఒకరు ఎమ్మెల్యేగా, ఒకరు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మారిన రాజీకీయ పరిణామాలతో ఎర్రెబల్లి ప్రస్తుత బీఆర్‌ఎస్ నాటి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎర్రబెల్లి కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకోగా, రేవంత్‌రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యారు. ఒకప్పుడు కలిసి పనిచేసిన వీరిద్దరూ ఇప్పుడు వైరి పక్షాలు. కానీ, 20 ఏళ్ల సహవాసం కారణంగా బలాలు, బలహీనతలు ఇద్దరికీ బాగా తెలుసు. ఈ నేపథ్యంలోనే హాథ్ సే హాథ్ జోడో యాత్ర చేస్తున్న రేవంత్‌రెడ్డి, తన మాజీ సహచరుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చాడు. అక్కడ నిర్వహించిన సభలో వేలాదిమంది సాక్షిగా మంత్రికి సవాల్ చేశారు. ‘ఎర్రబెల్లి దయాకర్‌రావు ఏబీసీడీలు రాస్తే రాజకీయాల నుంచి’ తప్పుకుంటా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పౌరుషం గల పాలకుర్తి గడ్డమీద పలక బలపం ఇస్తే ఓనమాలు రాయనోడు ఎమ్మెల్యే కావడం విచారకరమని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లికి చదువు రాదని ఎద్దేవా చేశారు. నాడు చంద్రబాబు ఆయనకు విప్‌గా అవకాశం ఇస్తే విస్మరించి కేసీఆర్ రాచరిక పాలన కోసం పావుగా పనిచేశారని, అందుకే ఈరోజు మంత్రి అయ్యాడని ఆరోపించారు.
టీడీపీని ముంచిన వెన్నుపోటుదారుడు..
ఎర్రబెల్లి దయాకర్‌రావు వెన్నుపోటు దారుడని, పాలకుర్తిలో డాక్టర్ సుధాకర్‌రావుకు వెన్నుపోటు పొడిచాడని రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. డాక్టర్ సుధాకర్‌రావు ఉన్నప్పుడే బావా బావా అని తిరుగుతుంటే వెన్నుపోటు పొడుస్తాడని చెప్పినా నమ్మలేదని, ఎర్రబెల్లి పొడిచిన వెన్నుపోటుతో డాక్టర్ సుధాకర్‌రావు కనుమరుగయ్యారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకీ వెన్నుపోటు పొడిచి ముంచిన దుర్మార్గుడు అని దుయ్యబట్టారు. చదువు రాని ఎర్రబెల్లికి చంద్రబాబు చాలా ప్రాధాన్యతనిస్తే ఎర్రబెల్లి కోవర్టులా మారి పార్టీకి తీరని నష్టం చేశారని గుర్తు చేశారు.
బీఆర్‌ఎస్‌కు టీడీపీ పరిస్థితే..
నాడు టీడీపీ తరహాలోనే నేడు బీఆర్‌ఎస్ పార్టీని కూడా ఎర్రబెల్లి దయాకర్‌రావు బొంద పెడతాడని, జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్‌ను రేవంత్ హెచ్చరించారు. ఎర్రబెల్లి వైఖరిపై రేవంత్‌రెడ్డి ఓ ఒక చిన్న కథ కూడా చెప్పారు. కేసీఆర్, ఎర్రబెల్లి కలిసి మేడారం అడవులకు వెళితే, పులి ఎదురైతే… కేసీఆర్‌ను కాపాడాల్సింది పోయి ఎర్రబెల్లి బూట్లు సదురుకుంటున్నట్టు నమ్మబలికి కేసీఆర్‌ను పులికి బలి ఇస్తాడు అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఎర్రబెల్లి వైఖరి అలా ఉంటుందని చెప్పారు.
బినామీ ఆస్తులు కూడబెడుతున్న ఎర్రబెల్లి
ఇక ధరణి పోర్టల్ ద్వారా బీఆర్‌ఎస్ నాయకులు భూదందాలు చేసి మంత్రి ఎర్రబెల్లికి బినామీ ఆస్తులను కూడబెడుతున్నారని రేవంత్ ఆరోపించారు. చెన్నూరు రిజర్వాయర్ టెండర్ డబల్ చేసి ఎర్రబెల్లి కమిషన్లు నొక్కాడన్నారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వ రాగానే ధరణి ద్వారా దోపిడీ చేసిన వారిని, భూ దందాలు చేసే వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. సబ్బండవర్ణాలు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని రాచరిక పోకడలతో పరిపాలిస్తున్న కేసీఆర్ దుష్ట పాలనకు చరమగీతం పడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

మొత్తంగా బీఆర్‌ఎస్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పాదయాత్ర మొదలు పెట్టిన రేవంత్‌రెడ్డి.. ఈ క్రమంలో తన మాజీ సహచరుడు, ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న∙నియోజకవర్గంలో నిలబడి ఆయనకే సవాల్ విసరడం, తీవ్రమైన ఆరోపణలు చేయడం ఇప్పుడు ఆ నియోజకవర్గంలో సంచలనమైంది. చర్చకు దారితీసింది.