Superstar Krishna- Indira Devi: సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిగత జీవితంలో అనేక నాటకీయ పరిణామాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన భార్య ఉండగానే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. హీరోయిన్ విజయ నిర్మలను కృష్ణ రహస్య వివాహం చేసుకున్నారు. హీరోగా ఎదుగుతున్న రోజుల్లోనే కృష్ణ విజయనిర్మలను పెళ్లి చేసుకున్నారు. ఇందిరా దేవి ఉన్నప్పటికీ కృష్ణ రెండవ పెళ్లి చేసుకోవడానికి కారణం… ప్రేమ వ్యవహారమే. తేనెమనసులు మూవీతో 1965లో కృష్ణ హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు.

అయితే అంతకు ముందే ఆయనకు వివాహం జరిగింది. ఆ రోజుల్లో వయసొచ్చిన వెంటనే పెద్దవాళ్ళు పెళ్లి చేసేవాళ్లు. చదువు పూర్తి చేసిన కృష్ణకు బంధువుల అమ్మాయి, వరసకు మరదలు అయ్యే ఇందిరాదేవితో 1962లో వివాహం చేశారు. పెళ్ళైన తర్వాత కృష్ణ మద్రాస్ వచ్చి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. గూఢచారి మూవీతో కృష్ణకు ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అనంతరం దర్శకుడు బాపు తెరకెక్కించిన సాక్షి సూపర్ హిట్ కొట్టింది. ఆ దెబ్బతో కృష్ణకు పరిశ్రమలో అవకాశాలు క్యూ కట్టాయి. సాక్షి మూవీలో కృష్ణకు జంటగా విజయనిర్మల నటించారు.
Also Read: Nagarjuna Ghost Pre- Review: ఘోస్ట్ మూవీ ప్రీ రివ్యూ ఎక్సక్లూసివ్ గా మీకోసం
ఆ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అప్పటికి విజయనిర్మలకు పెళ్ళై ఒక అబ్బాయి ఉన్నాడు. భర్తతో ఆమెకు విబేధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆమె కృష్ణకు దగ్గరయ్యారు. విజయనిర్మల కృష్ణకు అండగా ఉంటూ ఆయనకు సలహాదారుగా వ్యవహరించేవారు. అలా పరిచయం ప్రేమగా మారి పెళ్ళికి దారితీసింది. విజయనిర్మలను కృష్ణ ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి రహస్యంగా చేసుకున్నప్పటికీ మొదటి భార్య ఇందిర దగ్గర ఆయన విషయం దాచలేదు.

విజయ నిర్మలను రెండో వివాహం చేసుకున్నట్లు చెప్పాడు. భర్త అంటే అమితమైన ప్రేమ కలిగిన ఇందిరా దేవి ఆయన నిర్ణయాన్ని గౌరవించారు. ఇక కృష్ణ ఒకవైపు స్టార్ గా ఎదుగుతూ మరోవైపు ఇద్దరు భార్యలతో సన్నిహిత సంబంధాలు నెరిపారు. విజయ నిర్మలతో కృష్ణ పిల్లల్ని కనలేదు. నరేష్ మొదటి భర్తకు పుట్టిన అబ్బాయి. ఇక ఇందిరా దేవికి ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు అబ్బాయిలు కాగా, మంజుల, పద్మావతి, ప్రియదర్శి అనే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. కాగా ఇందిరా దేవి పబ్లిక్ లో కనిపించడానికి ఇష్టపడరు. ఆమె ఏళ్ల తరబడి కెమెరా వెనుక ఉండిపోయారు. నేడు అనారోగ్యంతో ఇందిర 70 ఏళ్ల వయసులో కన్నుమూశారు.