Chiranjeevi- Ram Charan: తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి మెగాస్టార్ గా తన స్థాయి నిరూపించుకుంటూనే ఉన్నారు. వైవిధ్యమైన చిత్రాల్లో నటించి తనకెదురు లేదని చాటిచెప్పిన ఆయన 150కి పైగా చిత్రాలు చేశారు. హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చి తీసిన ప్రతిబంధ్ కూడా హిట్ అయ్యింది. అక్కడా శభాష్ అనిపించుకున్నారు. తన కెరీర్ లో ఎన్నో మైలు రాళ్లు దాటారు. అయితే తన కెరీర్ మొత్తం మీద మెగాస్టార్ చిరంజీవికి కలిసొచ్చే రోజు ఒకటి ఉంది. అందే సెప్టెంబర్ 28. ఇదే రోజున హిందీలో ‘ప్రతిబంధ్’ విడుదలై సంచలన విజయం సాధించింది.
ఇక మెగాస్టార్ తనయుడు రాంచరణ్ కూడా తండ్రి పేరు నిలబెడుతున్నాడు. నటనలో ఆయన వారసుడిగా ఎదుగుతున్నాడు. వీరిద్దరికి ఒకే లక్కీ డేట్ ఉండటం విశేషం. మెగాస్టార్ చిరంజీవికి సెప్టెంబర్ 28 కలిసొచ్చిన తేదీ అయితే రాంచరణ్ కు కూడా అదే రోజు అదృష్టం వరించింది. రాంచరణ్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘చిరుత’ ఇదే రోజు విడుదలై సంచలన విజయం సాధించింది. ఇందులో నేహాశర్మ హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతం సమకూర్చారు. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా వైజయంతి మూవీస్ సంస్థలో నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు పూరీ జగన్నాథ్ నేతృత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించడం విశేషం.
ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా ట్రైలర్ కూడా ఇదే రోజున విడుదల అయ్యింది. దీంతో వీరి లక్కీ డేట్ మరోమారు సంచలనంగా మారబోతోందా? ఎందుకంటే ఇద్దరికి లైఫ్ ఇచ్చిన నేపథ్యంలో సెప్టెంబర్ 28 వారికి ఓ మంచి రోజుగా తెలుస్తోంది. దీంతో ప్రతిబంధ్, చిరుత లాగా గాడ్ ఫాదర్ కూడా కచ్చితంగా బ్రహ్మాండమైన హిట్ సాధిస్తుందని అందరి విశ్వాసం. తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ తో తన ఇమేజ్ మరోసారి చాటిచెప్పాలని భావిస్తున్నారు.
ప్రతిబంధ్ చిరంజీవి, రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో వచ్చిన నాలుగో చిత్రం. తెలుగులో ‘అంకుశం’గా కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన సీనిమాను హిందీలో రీమేక్ చేశారు. ఇది చిరంజీవి, రవిరాజా పినిశెట్టి, రాంరెడ్డికి హిందీలో మొదటి సినిమా కావడం విశేషం. దీంతో గాడ్ ఫాదర్ కూడా హిట్ సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిరుత, ప్రతిబంధ్ చిత్రాల వరుసలో గాడ్ ఫాదర్ కూడా చేరుతుందని చెబుతున్నారు. కానీ ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. గాడ్ ఫాదర్ తో చిరంజీవి మరోసారి తన ఇమేజ్ పెంచుకుంటారో లేదో చూడాల్సిందే.