YSRCP Candidates: 2019 ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ విధానంతో ముందుకెళ్లిన జగన్ అద్భుత ఫలితాలను సాధించారు. ఈసారి కూడా అదే పంథాను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తానని ప్రకటించారు. అదే సమయంలో బాగా పనిచేయని వారిని పక్కన పెడతానని కూడా హెచ్చరించారు. అటువంటి వారి పేర్లను సైతం ముందుగానే ప్రకటిస్తాని కూడా చెప్పారు. తాజాగా పార్టీ ఎమ్మెల్యేలతో మూడోసారి వర్క్ షాపు నిర్వహించిన జగన్ .. నవంబరులోగా పనితీరు మార్చుకోకుంటే మాత్రం వేటు తప్పదని స్పష్టమైన హెచ్చరికలైతే పంపారు. అదే సమయంలో సర్వే నివేదికలను అనుసరించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాల రిజల్ట్ పైనే అన్ని రాజకీయ పక్షాలు దృష్టిపెడతాయి. అక్కడ గెలుపొందిన పార్టీలే ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశముంది. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరితే ఆ ప్రభావం ఉభయగోదావరి జిల్లాలపై ఉంటుందని జగన్ భావిస్తున్నారు. అందుకే అక్కడ ప్రతీ నియోజకవర్గంపైనా జగన్ ఫోకస్ పెంచారు.
ఉభయగోదావరి జిల్లాల్లో ప్రతీ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలు, స్థానిక ఎమ్మెల్యే పనితీరు, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ.. ఇలా అన్ని కోణాల్లో సమాచారాన్ని సేకరిస్తున్నారు. దానిని అనుసరించి కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ నాలుగు స్థానాలను దక్కించుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత ఒక వైపు, టీడీపీ, జనసేన పొత్తు మరోవైపు జగన్ కు కలవరపాటుకు గురిచేస్తోంది. అందుకే ఇక్కడ పార్టీకి మైనస్ గా ఉన్న నియోజకవర్గాల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు. అభ్యర్థుల మార్పుపై కసరత్తు చేస్తున్నారు.
ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె బరిలో దిగనున్నారు. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా రౌతు సూర్యప్రకాశరావుపోటీచేశారు. ఈసారి ఆయన్నుతప్పించి రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మార్గని భరత్ ను బరిలో దించాలని జగన్ యోచిస్తున్నారు. అందుకే నియోజకవర్గ బాధ్యతలను తాజాగా ఆయనకు అప్పగించినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి తొలిసారిగా పోటీచేసిన భరత్ విజయం సాధించారు. లోక్ సభలో వైసీపీ విప్ గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సారి రాజమండ్రి అర్బన్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీచేసే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మండపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఉన్నారు. తాజాగా నియోజకవర్గ బాధ్యతలను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు అప్పగించారు. 2019 ఎన్నికల తరువాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన త్రిమూర్తులు అనూహ్యంగా ఎమ్మెల్సీ అయ్యారు. ఈయన సొంత నియోజకవర్గం రామచంద్రాపురం. ప్రస్తుతం ఇక్కడ మంత్రి చెల్లబోయిన వెంకట గోపాల క్రిష్ణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తోట త్రిమూర్తులు టిక్కెట్ ఆశిస్తున్నారు. అందుకే జగన్ రూటు మార్చారు. మండపేట నియోజకవర్గ బాధ్యతలను త్రిమూర్తులకు అప్పగించారు. ఇక్కడ కాపు సామాజికవర్గం ఓట్లు అధికం. అందుకే అదే సామాజికవర్గానికి చెందిన త్రిమూర్తులను ప్రయోగిస్తున్నారు. మొత్తానికైతే ఏపీ సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో గట్టెక్కేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.