Dinosaur: ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం అంతమైన భూమిపై జీవించిన రాక్షస బల్లులు ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లోనే మనకు కనిపిస్తున్నాయి. సినిమాల్లో చూస్తూ ఇలా ఉండేవట అనుకుంటున్నాం. ఆ రాక్షస బల్లులు ఇప్పుడు మనం తిరిగే ప్రదేశాల్లో ఒకప్పుడు తిరిగేవంట.. ఆ ఊహే భయంకరంగా ఉంది కదా. కానీ నిజం.. తెలుగు రాష్ట్రాల్లో కూడా తిరిగాయట. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో సంచారం..
అప్పట్లో భూమిపై ఎక్కడా మనుషులు లేరు. భవనాలు, కార్లు ఏవీ లేవు. ఉన్నదల్లా నదులు, అడవులే. ఆ కాలంలో డైనోసార్లు స్వేచ్ఛగా తిరిగేవి. ఆరున్నర కోట్ల సంవత్సరాల కిందట అవి.. ఉల్కాపాతం వల్ల చనిపోయాయనే అంచనా ఉంది. ఐతే.. వాటి శిలాజాలు.. భారత్ సహా చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి. తాజాగా ప్రాణహిత నది తీర ప్రాంతంలో ఇవి కనిపించాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి, తెలంగాణలోని కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత నది ప్రవహిస్తోంది. ఈ నది చెంత ఆదిమానవులు జీవించినట్లు ఇదివరకే ఆధారాలు లభించాయి. రాక్షస బల్లులు కూడా జీవించాయని సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది. ప్రాణహిత నది… గోదావరి నదికి ఉపనదిగా ఉంది. ఈ నది కింద భూమిలో అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తోందని చెబుతుంటారు. అలాగే పురాణాల్లో కూడా ఈ నది ప్రస్తావన ఉంది. తాజాగా నదీ తీరంలో రాక్షస బల్లులు తిరిగాయని పురావస్తు శాఖ ప్రకటించింది.
బిర్లా సైన్స్ మ్యూజియంలో రాక్షస బల్లి కళేబరం..
హైదరాబాద్ .. బిర్లా సైన్స్ మ్యూజియంలో రాక్షసబల్లి కళేబరాన్ని మనం చూడవచ్చు. ఆమధ్య ప్రాణహిత నది తీర ప్రాంతంలోని వేమనపల్లిలో రాక్షస బల్లి కళేబరాన్ని గుర్తించారు. దీనిని హైదరాబాద్.. బిర్లా సైన్స్ మ్యూజియంలో ఈ రాక్షసబల్లి కళేబరాన్ని భద్రపర్చారు. వేమనపల్లిలో జరిపిన తవ్వకాల్లో.. 16 కోట్ల సంవత్సరాలకు ముందే ఇక్కడ డైనోసార్లు ఉన్నట్లు తెలిసింది. ఇక్కడే కాదు తెలంగాణలోని బొప్పారం, కోటపల్లి, నీల్వాయిలో కూడా రాక్షస బల్లులు తిరిగినట్లు తెలిపే శిలాజాలు బయటపడ్డాయి.
అడ్వెంచర్ టూరిజంపై ప్రభుత్వం దృష్టి..
తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ డైనోసార్లపై దృష్టి సారించింది. ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతంలో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం పర్యాటక శాఖ, అటవీ శాఖ కలిసి ప్లాన్ రెడీ చేస్తున్నాయి. డైనోసార్ల అడ్డాగా భావిస్తున్న అసిఫాబాద్‌లో డైనోసార్ ఫాజిల్ పార్క్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంరెడీ అవుతోంది. ఈ పార్కులో రకరకాల డైనోసార్లతోపాటూ.. ఒకప్పటి శిలాజాలను కూడా ప్రదర్శిస్తారని తెలుస్తోంది.

జూబ్లీహిల్స్‌లో డైనోసార్ పార్కు..
ప్రస్తుతం హైదరాబాద్… జూబ్లీహిల్స్‌లో ఓ డైనోసార్ పార్క్ ఉంది. అది సిటీ మధ్యలో సాధారణ పార్క్‌లా ఉండటం, చాలా చిన్నగా ఉండటం వల్ల దానికి అంతగా ఆదరణ రాలేదు. అసిఫాబాద్‌లో అడవులు ఎక్కువ. అలాంటి చోట.. డైనోసార్ పార్క్ ఏర్పాటు చేస్తే.. దానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది.
పూర్వకాలంలో నదీ పరీవాహక ప్రాంతాల్లోనే డైనోసార్లు ఎక్కువగా జీవించినట్లు ఆధారాలున్నాయి. నదుల్లో చేపలు ఇతర ఆహారంతోపాటూ… పక్కనే ఉన్న అడవుల్లో జంతువుల్ని తింటూ అవి బతికేవనే అంచనా ఉంది. ఈ క్రమంలో ప్రాణహిత నది.. రాక్షస బల్లులకు ప్రాణం ఇచ్చింది. అవి అంతరించిపోకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు ఇండియా అంతటా డైనోసార్లు ఉండేవంటున్నారు శాస్త్రవేత్తలు.