
మనలో చాలామందికి రాజకీయాలు, సినిమాల గురించి అవగాహన ఉన్నా చట్టాల గురించి మాత్రం అవగాహన ఉండదు. బలవన్మరణానికి ప్రేరేపించడం, దొంగతనం, బెదిరింపులు, మోసాలకు పాల్పడటం లాంటి వాటికి ఎలాంటి శిక్షలు వేస్తారనే విషయం తెలియదు. అయితే మనం ఖచ్చితంగా చట్టాల గురించి కనీస అవగాహనను ఏర్పరచుకోవాలి. మనం ఇతరులు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించినా మన మాటల వల్ల అవతలి వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నా సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసి నిరూపితమైతే జైలు శిక్ష విధిస్తారు.
ఏ వ్యక్తినైనా అక్రమంగా అడ్డగించడం లాంటి పనులు చేస్తే సెక్షన్ 341 కింద కేసు నమోదు చేసి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ఏ వ్యక్తినైనా అక్రమంగా నిర్భంధిస్తే సెక్షన్ 342 కింద కేసు నమోదు చేసి శిక్షతో పాటు ఫైన్ విధిస్తారు. ఇంట్లో నుండి దొంగతనం చేస్తే సెక్షన్ 380 కింద 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా ఇతరులను నమ్మించి మోసం చేస్తే సెక్షన్ 406 కింద కేసు నమోదు చేసి కేసు తీవ్రతను బట్టి రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధిస్తారు.
ఇతరుల నుంచి ఆస్తి లేదా విలువైన వస్తువులను మోసపూరితంగా తీసుకుంటే సెక్షన్ 420 కింద కేసు నమోదవుతుంది. వీళ్లకు కోర్టు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇతరులపై బెదిరింపులకు పాల్పడితే సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి కేసు తీవ్రతను బట్టి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది కలిసి కుట్రకు పాల్పడితే సెక్షన్ 120 బి కింద కేసు నమోదు చేస్తారు. కేసు ప్రూవ్ అయితే రెండేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు శిక్ష పడుతుంది.