
Tarakaratna- NTR: సినిమా వారసత్వాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సక్సెస్ అయితే అభిమానగణం, కీర్తి, డబ్బు, హోదా, సిల్వర్ స్క్రీన్ మీద ఎన్నటికీ నిలిచిపోయే మన గుర్తులు వదిలిపోవచ్చు. అందుకే దర్శకులు, నిర్మాతల కొడుకులు కూడా హీరోలు కావాలనుకుంటారు. అయితే విచిత్రంగా నందమూరి ఫ్యామిలీ నుండి అతి తక్కువ మంది మాత్రమే పరిశ్రమలో నటులుగా అడుగుపెట్టారు. ఎన్టీఆర్ కి 8 మంది కుమారులు కాగా బాలకృష్ణ, హరికృష్ణ మాత్రమే నటనను వృత్తిగా స్వీకరించారు.
ఇక మూడవ తరంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్నలు హీరోలుగాఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ స్టార్ హోదా దక్కించుకున్నాడు. తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఆసక్తి లేదని సమాచారం. అందుకే ముప్పై ఏళ్ళు దగ్గరపడుతున్నా ఆయన నటన వైపు అడుగులు వేయలేదు. అయితే తారకరత్న ఎంట్రీపై ఒక ఆసక్తికర వాదన ఉంది. ఎన్టీఆర్ ని నందమూరి హీరోగా అంగీకరించని, అతని ఎదుగుదల చూసి తట్టుకోలేని కుటుంబ సభ్యులే కుట్ర పన్నారట. సినిమా సినిమాకు తన స్టార్డం పెంచుకుంటున్న ఎన్టీఆర్ ని కట్టడి చేయడం కోసం తారకరత్నను రంగంలోకి దించారట.
తొమ్మిది సినిమాలతో భారీగా లాంచ్ చేయడం వెనుక కారణం కూడా ఇదేనట. టాలీవుడ్ చాలా కాలంగా ఈ చర్చ నడుస్తోంది. అయితే తారకరత్న ఈ ఆరోపణపై గతంలో స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఇదంతా దుష్ప్రచారం మాత్రమే అన్నారు. నేను వచ్చే నాటికే ఎన్టీఆర్ స్టార్ అయిపోయాడు. నందమూరి ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్లిన ఎన్టీఆర్ విషయంలో గర్వపడతాను. అతనికి పోటీగా మనం ఎదగాలి, తొక్కేయాలనే ఆలోచనలు ఎన్నడూ లేవంటూ… తారకరత్న తెలిపారు. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ తో నాకు బలమైన అనుబంధం ఉందన్నారు.

నేను పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు ఆర్థిక సమస్యలు తలెత్తాయి. కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి. తల్లిదండ్రుల సప్పోర్ట్ లేదు. ఆ టైం లో ఎన్టీఆర్ నాకు ఆర్థిక సహాయం చేశారు. నాలుగు లక్షల రూపాయలు పంపించారు. ఆ విషయం ఎవరికీ తెలియదంటూ.. తారకరత్న చెప్పుకొచ్చారు. కాగా ఫిబ్రవరి 18న తారకరత్న కన్నుమూశారు. అన్నయ్య మృత దేహాన్ని చూసి ఎన్టీఆర్ దుఃఖం ఆపుకోలేకపోయారు. జనవరి 27న కార్డియాక్ అరెస్ట్ కి గురైన తారకరత్న సుదీర్ఘ పోరాటం చేసి 23 రోజుల అనంతరం కన్నుమూశారు. 2012లో అలేఖ్య రెడ్డిని తారకరత్న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.
