Dhamaka Pre-Release Business: మాస్ మహరాజ్ రవితేజ ఈసారి ధమాకా అంటూ థియేటర్స్ లో దిగుతున్నారు. ఈ చిత్ర విజయం ఆయనకు చాలా అవసరం. ఆయన గత రెండు చిత్రాలు పూర్తిగా నిరాశపరిచాయి. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ విజయం సాధించలేదు. క్రాక్ విజయంతో వచ్చిన ఆనందాన్ని ఆవిరి చేశాయి. ధమాకా అటో ఇటో అయితే హ్యాట్రిక్ ప్లాప్స్ మూటగట్టుకోవాల్సి వస్తుంది. రవితేజకు ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకం అని చెప్పాలి. జయాపజయాలతో సంబంధం లేకుండా ధమాకా చెప్పుకోదగ్గ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

పరిశ్రమలో ధమాకా చిత్రంపై ఉన్న పాజిటివ్ బజ్ కారణంగా మంచి రేటు దక్కింది. ఇక ధమాకా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. నైజాం హక్కులు రూ. 5.5 కోట్లు పలికాయి. ఇక సీడెడ్ రూ. 2.5 కోట్లు. ఆంధ్రా రూ. 8 కోట్లు. ఏపీ/తెలంగాణా కలిపి రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక, రెస్టాప్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని మరో రూ. 2.3 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తంగా ధమాకా వరల్డ్ వైడ్ రూ. 18.3 కోట్ల బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
కాబట్టి కనీసం రూ. 19 కోట్ల షేర్ వసూలు చేస్తే ధమాకా బ్రేక్ ఈవెన్ చేరుకున్నట్లు. హిట్ టాక్ రావాలంటే రూ. 20-21 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. మరి ఫార్మ్ లో లేని మాస్ మహరాజ ఏం చేస్తారో చూడాలి. త్రినాధరావు నక్కిన ఈ చిత్ర దర్శకుడు. కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. తనికెళ్ళ భరణి, సచిన్ ఖేడేకర్, జయరామ్ కీలక రోల్స్ చేస్తున్నారు.

కాగా క్రాక్ తర్వాత రవితేజ అరడజను చిత్రాలు ప్రకటించారు. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ విడుదలయ్యాయి. ధమాకా డిసెంబర్ 23న విడుదల కానుంది. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మరొక మూవీ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అలాగే చిరంజీవి హీరోగా విడుదలకు సిద్ధం అవుతున్న వాల్తేరు వీరయ్య మూవీలో పోలీస్ అధికారిగా కీలక రోల్ చేశారు. హీరోగా రవితేజ కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకున్న సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సిద్ధాంతం పాటిస్తున్నట్లున్నారు.