Srikalahasti Temple: శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి దక్షిణ కాశీగా పేరు ఉంది. శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్నెన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులో ఈ టి సి కేంద్రంలోని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ ఆలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇక్కడ శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోనే పూజాధి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.అయితే ఇక్కడ పూజలు నిర్వహిస్తుండగా…స్వామి వారు కళ్ళు తెరవడం పూజారి కంట పడింది. ఈ విషయం దావనంలా వ్యాపించింది. భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు.స్వామివారిని దర్శించుకున్నారు.
ఉదయం పూజారి గంగయ్య స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పూజలకు ఉపక్రమిస్తుండగా.. శివలింగం నుంచి స్వామి వారు కళ్ళు తెరిచినట్లుగా కనిపించారు. వెంటనే స్థానికులు వచ్చి పరిశీలించగా అదే మాదిరిగా కనిపించింది. ఈ విషయం పట్టణంలో ఆ నోటా ఈ నోటా విస్తరించడంతో భక్తులు అధిక సంఖ్యలోఆలయానికి చేరుకున్నారు. కనులారా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు.
సాయంత్రానికి భక్తుల తాకిడి పెరిగింది.శ్రీకాళహస్తి వచ్చిన భక్తులంతా ఆలయానికి చేరుకున్నారు. దీంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. చివరకు శ్రీకాళహస్తి పోలీసులు అక్కడకు చేరుకున్నారు. భక్తులను నియంత్రించారు. క్యూలైన్లలో క్రమ పద్ధతిలో పంపించారు. అయితే క్రమేపీ పెరుగుతున్న భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది.