Delhi Judge
Delhi Judge: ఢిల్లీ హైకోర్టు జడ్జి (Delhi HC judge) జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో ఈనెల 14న అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో యశ్వంత్ వర్మ ఢిల్లీలో లేరు. ఆయన కుటుంబ సభ్యులు అగ్నిమాపక శాఖ సిబ్బందికి ఫోన్ చేస్తే వారు.. మంటలు ఆర్పడానికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ వారికి భారీగా నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని చెప్పడం.. అది కాస్త సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (CJI) సంజీవ్ ఖన్నా దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన వెంటనే స్పందించారు. ఈ విషయాన్ని కొలీజియం దృష్టికి తీసుకెళ్లారు. కొలీజియం సిఫారసు మేరకు యశ్వంత్ వర్మను అలహాబాద్ కు బదిలీ చేశారు. యశ్వంత్ వర్మ ఇంట్లో లభించిన నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దానిని లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు. అయితే ఈ విషయం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు తెలియడంతో ఆయన వెంటనే స్పందించారు. ఈ విషయాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ కోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే యశ్వంత్ వర్మ గతంలో అలహాబాద్ కోర్టులో పని చేశారు. 2021లో న్యూఢిల్లీకి వచ్చారు. కొలీజియం సభ్యులు యశ్వంత్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. యశ్వంత్ వర్మ బదిలీ వల్ల సమస్య పరిష్కారం కాదని.. న్యాయవ్యవస్థపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోతుందని కొలీజియం సభ్యులు అభిప్రాయపడ్డారు. బదిలీ అనేది సమస్యను పరిష్కరించదని.. యశ్వంత్ వర్మతో రాజీనామా చేయించాలని.. లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంతర్గత విచారణ చేపట్టాలనే అభిప్రాయాన్ని కొలీజియం సభ్యులు వ్యక్తం చేశారు.
Also Read: తిరుమలలో చంద్రబాబు కుటుంబం.. భక్తుల ఒకరోజు అన్నదానానికి విరాళం!
నాడు కూడా..
యశ్వంత్ వర్మ ఉదంతం ఇప్పుడు న్యాయవర్గాలను ఆందోళనకు గురి చేస్తోంది. సోషల్ మీడియాలో యశ్వంత్ వర్మ వ్యవహారం చర్చకు కారణమవుతోంది. నెటిజన్లు యశ్వంత్ వర్మ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన న్యాయమూర్తి ఇలా దారి తప్పడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యాయం కోసం వచ్చిన వారికి అన్యాయం చేయడం ద్వారానే అంతలా డబ్బు సంపాదించి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఇక యశ్వంత్ వర్మ తరహాలోనే 2008లోనూ ఇటువంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. 2008 ఆగస్టు 13న పంజాబ్ – హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్ జీత్ కౌర్ ఇంటి ఎదుట 15 లక్షల నోట్ల కట్టలు ఉన్న ఒక పెట్టెను కొందరు వ్యక్తులు ఉంచారు. దీనిపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి.. కేసును సిబిఐ కి అప్పగించారు. కేసును సుదీర్ఘకాలం దర్యాప్తు జరిగిన తర్వాత 2011 మార్చిలో ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జి నిర్మల్ యాదవ్ పై అభియోగాలు మోపారు. ఆమె 2009 వరకు పంజాబ్ – హర్యానా హైకోర్టులో పని చేశారు. అయితే నిర్మల్ యాదవ్ ఓ కేసులో తీర్పు నిమిత్తం డబ్బు డిమాండ్ చేశారని.. ప్రతివాదులుగా ఉన్న వ్యక్తులు ఆ డబ్బులు ఆయనకు బదులుగా నిర్మల్ జీత్ కౌర్ ఇంటి ఎదుట పెట్టారు. దీంతో ఆ విషయం కాస్త సంచలనంగా మారింది. ఈ ఘటనలో నిర్మల్ జీత్ కౌర్ తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి నిర్మల్ యాదవ్ తప్పుడు తీర్పు చెప్పడం ద్వారా డబ్బులు ఆశించారని తెలియడంతో ఆయనపై న్యాయశాఖ కఠిన చర్యలు తీసుకుంది. దాదాపు 14 సంవత్సరాల తర్వాత మళ్లీ న్యాయశాఖలో ఇటువంటి ఉదంతం చోటు చేసుకోవడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది.