YCP Party
YCP: ఎస్సీ వర్గీకరణకు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ వ్యతిరేకం అని తేలిపోయింది. అలాగని ఆ పార్టీ బాహటంగా ప్రకటించలేదు. కానీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టేందుకు శాసనమండలి చైర్మన్ మూసేన్ రాజు అంగీకరించలేదు. ఆ బిల్లును పక్కన పెట్టేశారు. దీంతో ఆర్డినెన్స్ చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే వర్గీకరణ విషయంలో ఆది నుంచి తెలుగుదేశం పార్టీ స్పష్టంగా ఉంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారులుగా మాలలు ఉన్నారు. వారు ఎక్కడ దూరమైపోతారన్న ఆందోళనతో వర్గీకరణ విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పలేని స్థితిలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* ఆది నుంచి గట్టి మద్దతు దారులు
ఆది నుంచి ఎస్సీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం వారిలో వ్యత్యాసం కనిపించింది. మెజారిటీ ఎస్సీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నా.. ఆ వర్గంలో చీలిక ఏర్పడింది. సమాజంలో మిగతా వర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరం కావడంతో కూటమి ప్రభంజనానికి కారణం అయ్యింది. ఈసారి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో( SC reserved constituencies ) సైతం కూటమి విజయం సాధించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానాలు అయింది. కానీ ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో ఉనికి చాటుకుంది. తనకు ఎస్సీల్లో బలం తగ్గలేదు అని నిరూపించుకుంది.
* సంక్లిష్ట పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్
ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ విషయంలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ. ఎస్సీ వర్గీకరణను ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు మాలలు. అలా వర్గీకరిస్తే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయి అన్నది వారిలో ఉన్న ఆందోళన. అదే సమయంలో వర్గీకరణ లేకుంటే మాలలు ఎక్కువగా ప్రయోజనం పొందుతున్నారని ఎస్సీల్లో మిగతా వర్గాల వారిలో ఆవేదన. అయితే మాలలు ఎక్కువగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు దారులుగా ఉన్నారు. వర్గీకరణకు ఓకే చెబితే వారంతా దూరమయ్యే అవకాశం ఉంది. అలాగని సైలెంట్ గా ఉంటే ఎస్సీల్లో మిగతా సామాజిక వర్గాలు దూరం కావడం ఖాయం. అందుకే ఎటు తేల్చుకోలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి.
* ఎలాగైనా వర్గీకరణ ఆగదు..
ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)వ్యతిరేకించినా ఎస్సీ వర్గీకరణ ఆగదు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చర్యలు చూస్తుంటే మాత్రం వర్గీకరణను వ్యతిరేకించినట్లు కనిపిస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఎస్సి సామాజిక వర్గం నేతలు మాత్రం ఈ విషయంలో ఆందోళన చెందుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా టిడిపి ముందుకు సాగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత కనబరిచింది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పలేదు. అటువంటిప్పుడు ఎస్సీ వర్గీకరణను ఎందుకు వ్యతిరేకించాలి అన్నది ఆ నేతల ప్రశ్న. మొత్తానికి అయితే ఎస్సీ వర్గీకరణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు తెచ్చినట్టే కనిపిస్తోంది.