Mariana Kobayashi Linked: ఉద్యోగం పోయిందని బాధ వలదు.. ఈ యువతి కొలువు ప్రయాణం.. ఎందరికో పాఠం

మరియానా కొబయాషి అనే మహిళ ఉద్యోగ సమాచారం అందించే లింక్డ్ ఇన్ సైట్ లో ఎగ్జిక్యూటివ్ గా పని చేసేది. అయితే ఇటీవల ఆ సంస్థ చాలామంది ఉద్యోగులను తొలగించింది.

Written By: Suresh, Updated On : February 13, 2024 1:51 pm

Mariana Kobayashi Linked

Follow us on

Mariana Kobayashi Linked: “ఓ చేత్తో డిగ్రీ పట్టా.. మరో చేత్తో ఖాళీ పొట్ట.. పట్టుకుని తిరుగుతున్నాం. అయిననూ ఉద్యోగం రావడం లేదు. యువతకు ఉద్యోగం కల్పించలేని ఈ ప్రభుత్వాలు ఎందుకు? కొలువులకు పనికి వచ్చే చదువులు చెప్పని ఈ విశ్వవిద్యాలయాలు ఎందుకు?” అప్పట్లో విడుదలైన ఓ సినిమాలో దివంగత నటుడు శ్రీహరి పలికిన డైలాగ్ అది. ప్రస్తుతం లే ఆఫ్ లతో బాధపడుతున్న ఎంతోమంది యువతకు ఆ డైలాగ్ అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. అయితే ఇలా ఉద్యోగాలు కోల్పోతున్న యువత తీవ్ర నైరాశ్యం లోకి వెళ్లిపోతున్నారు. ఉద్యోగం లేకపోతే జీవితమే లేదన్నట్టుగా బాధపడుతున్నారు. కొందరైతే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారందరికీ ఓ యువతి ఆదర్శంగా నిలుస్తోంది. అలాగని ఆమె ఉద్యోగాలు కల్పించేందుకు సంస్థను ఏర్పాటు చేయలేదు. నిరుద్యోగుల కోసం ఉచితంగా డబ్బులు ఇవ్వడం లేదు. కానీ తన జీవిత ప్రయాణం లో ఒక చిన్న అనుభవాన్ని వీడియో రూపంలో తీసింది. అది ఎంతోమందిలో ఆశావాహ దృక్పథాన్ని పెంచుతున్నది..

మరియానా కొబయాషి అనే మహిళ ఉద్యోగ సమాచారం అందించే లింక్డ్ ఇన్ సైట్ లో ఎగ్జిక్యూటివ్ గా పని చేసేది. అయితే ఇటీవల ఆ సంస్థ చాలామంది ఉద్యోగులను తొలగించింది. అందులో మరియానా కొబయాషి కూడా ఒకరు. ఈ క్రమంలో ఉద్యోగం పోయిందని బాధపడకుండా మరొక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసింది. తన చదువు తగ్గట్టు ఉద్యోగం గూగుల్ లో ఉందని తెలుసుకుని ఆమె ఒక వినూత్న విధానాన్ని అవలంబించింది. ఫలితంగా మరియానా కొబయాషి గూగుల్ డబ్లిన్ లో ఉద్యోగం సంపాదించింది. వాస్తవానికి గూగుల్ కూడా ఎంతోమంది ఉద్యోగులను తొలగిస్తోంది. అయితే మరియానా కొబయాషి రూపొందించిన వీడియో ఫార్మట్ జాబ్ అప్లికేషన్ గూగుల్ సంస్థ ప్రతినిధులకు బాగా నచ్చింది. పైగా ఆమె మాట తీరు బాగుండడంతో గూగుల్ ప్రతినిధులు ఆమెకు ఉద్యోగాన్ని ఇచ్చారు. సాధారణంగా ఉద్యోగానికి వెళ్లే వారు సంప్రదాయ రీతిలో రెజ్యూమ్ తయారు చేస్తారు. కానీ వారందరి కంటే భిన్నంగా మరియానా కొబయాషి వీడియో ఫార్మట్ లో జాబ్ అప్లికేషన్ రూపొందించింది. ఆమె చేసిన ఈ సరికొత్త ప్రయత్నం సత్ఫలితాన్ని ఇచ్చింది. వాస్తవానికి గూగుల్ సంస్థలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ అత్యంత కఠినంగా ఉంటుంది. చాలా రౌండ్ల ఇంటర్వ్యూలను ఎదుర్కొన్న తర్వాత అందులో ఎంపికైన వారికే ఉద్యోగాలు ఇస్తారు. జీతభత్యాలు కూడా బాగుండడంతో చాలామంది గూగుల్ లో పనిచేయడానికి ఇష్టాన్ని చూపిస్తారు. అందుకే గూగుల్ సంస్థలో పనిచేయడానికి లక్షల్లో దరఖాస్తులు వెళ్తూ ఉంటాయి.

మరియానా కొబయాషి లింక్డ్ ఇన్ లో ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత.. గూగుల్ సంస్థలో ఉద్యోగాన్ని పొందేందుకు వినూత్న రీతిలో తన జాబ్ అప్లికేషన్ రూపొందించింది. వీడియో ఫార్మేట్ లో తన మాజీ కొలీగ్స్, ఇండస్ట్రీ కాంటాక్ట్స్, రిఫరెన్స్లన్నిటిని వీడియోలో జోడించింది. తనలో ఉన్న లోపాలను కూడా బయట పెట్టింది. వాటిని అధిగమించడానికి తను ఏం చేస్తుందో కూడా చెప్పింది. దాదాపు 10 గంటల పాటు కష్టపడి రూపొందించిన ఈ వీడియో ఫార్మాట్ జాబ్ అప్లికేషన్ ను ఆమె నేరుగా గూగుల్ హైరింగ్ మేనేజర్ కు పంపింది. తర్వాత ఆన్ లైన్ లోనూ షేర్ చేసింది.. ఎప్పటికప్పుడు గూగుల్ రిక్రూటర్ తో మరియానా కొబయాషి టచ్ లో ఉంది. మూడు దశల్లో ఇంటర్వ్యూను విజయవంతంగా పూర్తి చేసింది. అనంతరం తుది జాబితాకు అర్హత సాధించింది. ఆ తర్వాత ఆమెకు గూగుల్ హైరింగ్ మేనేజర్ ఫోన్ చేసి ఉద్యోగం ఇస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు మీరు ఓవర్ క్వాలిఫైడ్ అంటూ కితాబు ఇచ్చారు. అయితే గూగుల్ సంస్థ త్వరలో చేపట్టబోయే వివిధ ప్రాజెక్టుల కోసం ఆమెను తీసుకున్నామని హైరింగ్ మేనేజర్ ప్రకటించారు.మరియానా కొబయాషి వీడియో ఫార్మేట్ అప్లికేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఉద్యోగం పోయిందని బాధపడకుండా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆమె తన జాబ్ అప్లికేషన్ ను వీడియో ఫార్మేట్లో రూపొందించడం.. అది గూగుల్ సంస్థకు నచ్చడంతో ఆమెకు రెట్టింపు జీతమే కాదు.. గొప్ప యాజమాన్యంతో పనిచేసే అవకాశం లభించింది.