
ప్రపంచ దేశాల్లోని అన్ని రంగాలపై కరోనా వైరస్ ప్రభావం పడింది. వైరస్ వల్ల ప్రైవేట్ సంస్థల్లో పని చేసే కోట్లాది మంది ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. అయితే మనుషులే ఉద్యోగాలు కోల్పోతున్న కరోనా కష్ట కాలంలో ఒక పిల్లి మాత్రం సులభంగా ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగింది. వినడానికి కొంచెం వింతగానే ఉన్నా ఆస్ట్రేలియాలో ఒక పిల్లి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాన్ని సాధించింది. సంస్థ యాజమాన్యం పిల్లికి ఐడీ కార్డు కూడా ఇవ్వడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలో ఎప్ వర్త్ ఆస్పత్రి దగ్గర కొన్ని నెలల నుంచి ఒక పిల్లి తిరుగుతోంది. ఆస్పత్రికి సమీపంలోనే ఆ పిల్లి ఎల్లప్పుడూ ఉండటాన్ని సిబ్బంది, యాజమాన్యం గమనించింది. దీంతో యాజమాన్యానికి ఒక వింత ఆలోచన వచ్చింది. ఎప్పుడూ ఆస్పత్రి ఆవరణలో ఉండే పిల్లికి సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కలిగింది. అనుకున్నదే తడవుగా యాజమాన్యం పిల్లికి ఐడీ కార్డు ఇచ్చింది.
ఆ ఐడీ కార్డుపై “ఎల్వుడ్” అని పిల్లి పేరు రాసి ఉంది. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం పొందిన పిల్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముద్దుగా ఉన్న పిల్లిని చూసి అక్కడ ఉన్న రోగులు కూడా సంతోషపడుతున్నారని తెలుస్తోంది. అధికారికంగా సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం అందుకున్న పిల్లి సోషల్ మీడియాలో తెగ పాపులరైంది. పిల్లి ఉద్యోగం చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.