Chhattisgarh: చత్తీస్ గడ్ ఎన్నికల్లో బిజెపి విజయం సాధించింది. 90 అసెంబ్లీ స్థానాలకు గాను.. 54 చోట్ల గెలుపొంది అధికారాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ చేతిలో ఉన్న ఈ రాష్ట్రం కమలం గూటికి వచ్చింది. అయితే ఎక్కడికక్కడే అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి. ఎన్నికల్లో ఓ సామాన్యుడి విజయం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. కుమారుడు హత్యతో కడుపు మండి ఎన్నికల బరిలో దిగిన ఓ దినసరి కూలీ రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థి పై విజయం సాధించారు. శాసనసభలో అడుగుపెట్టి.. ఇది సామాన్యుడు సత్తా అంటూ ఎలుగెత్తి చాటారు.
చత్తీస్గడ్ కు చెందిన ఈశ్వర్ సాహు ఓ దినసరి కూలీ. పనికి వెళ్తే కానీ పూట గడవని కుటుంబం ఆయనది. చత్తీస్ గడ్ లో జరిగిన అల్లర్లలో ఆయన కుమారుడు భువనేశ్వర్ సాహూ కన్నుమూశాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తన కుమారుడు మృతి చెందడాన్ని ఈశ్వర్ సాగు జీర్ణించుకోలేకపోయాడు. కుమారుడి హత్యతో కాంగ్రెస్ ప్రభుత్వం పై ఈశ్వర్ సాహు ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ కేసులో దోషులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని… బిజెపి సైతం పోరాటం చేసింది. అదే సమయంలో ఈశ్వర్ సాహు పోరాటాన్ని బిజెపి హై కమాండ్ గుర్తించింది. ఆయనకు అన్ని విధాలా చేయూతనిచ్చింది.
ఈ పరిస్థితుల్లో చత్తీస్ గడ్ కు ఎన్నికలు వచ్చాయి. సాజా అసెంబ్లీ స్థానం నుంచి అనూహ్యంగా ఈశ్వర్ సాహును బిజెపి బరిలో దించింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేపై 5527 ఓట్ల మెజారిటీతో ఈశ్వర్ గెలుపొంది రికార్డ్ సృష్టించాడు. ఏడుసార్లు గెలిచిన ఎమ్మెల్యే పై ఓ సామాన్యుడు విజయం సాధించడం సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా ఈశ్వర్ సాహు విజయం చర్చనీయాంశంగా మారింది. ఇది ఓ సామాన్యుడు విజయమని.. తన విజయానికి సహకరించిన వారందరికీ ఈశ్వర్ సాహు ధన్యవాదాలు తెలిపారు.