Telangana CM Candidate: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 64 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా నాలుగు సీట్లు ఎక్కువగానే గెలవడంతో ఇక సీఎం ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టిపెట్టింది. ముఖ్యమంత్రి పదవి కోసం ఐదురుగు పోటీ పడుతున్నారు. హైదరాబాద్‌లోని ఎల్లా హోటల్‌లో సోమవారం నిర్వహించిన కొత్త ఎమ్మెల్యేల సమావేశంలో సీఎంపై ఏకాభిప్రాయం కుదరలేదని తెలిసింది. దీంతో నిర్ణయాధికారం అధిష్టానానికి అప్పగిస్తూ 64 మంది ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు. దీంతో ఈ తీర్మనంతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. మంగళవారం సీఎం ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రేసులో ఐదుగురు..
ఇక సీఎం పదవి కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు హుజూర్‌నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పోటీ పడుతున్నారు.
= తెలంగాణలో అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి.. గెలుపు తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఆయనకే సీఎం పదవి ఇవ్వాలని చాలా మంది కోరుతున్నారు.
= సీనియారిటీ ప్రాతిపదిక, అనుభవం ఆధారంగా ముఖ్యమంత్రి పదవి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అయితే బాగుంటుంది అన్న అభిప్రాయం కొంతమందిలో వ్యక్తమవుతోంది. వివాద రహితుడు కావడం, అందరినీ కలుపుపోయే తత్వం ఉండడం, పాదయాత్రతో ఆయన కూడా పార్టీ బలోపేతానికి కృషి చేశాడన్న అభిప్రాయం నేపథ్యంలో భట్టికి కూడా కొంతమంది మద్దతు ఇస్తున్నారు.
= ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా సీనియారిటీ కోటాలో సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ అయితే బాగుంటుందని కొంతమంది కోరుతున్నారు. వివాద రహితుడు కావడం, ఎలాంటి నేర చరిత లేకపోవడం, టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించిన అనుభవం కూడా ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్‌గా చెబుతున్నారు.
= కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సీఎం పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. తన అనుకూల ఎమ్మెల్యేలతో వెంటకరెడ్డి అయితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని సీఎల్పీ సమావేశంలో వినిపించారు. పార్టీకి వీర విధేయుడిగా ఉండడం, సోనియా కుటుంబంతో సత్సంబంధాలు ఉండడం ఆయనకు ప్లస్ పాయింట్లు.
= మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కూడా సీఎం రేసులోకి వచ్చారు. ఎన్నికల ముందు వరకు ఆయన పేరు సీఎం రేసులో లేదు. కానీ సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తే.. తాను కూడా ఉన్నట్లు సంకేతం ఇస్తున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అనుభం ఉన్న నేపథ్యంలో తనకూ చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.