
Chandrababu- KVP: రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. ఇప్పటి వరకు టిడిపి – జనసేన – వామపక్షాల కూటమిపై జోరుగా చర్చలు సాగుతుండగా, తాజాగా చంద్రబాబుతో కాంగ్రెస్ కలిసి వెళ్లే అంశంపైనా చర్చ నడుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు చేసిన పలు వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. రాహుల్ గాంధీకి అండగా ఉండేందుకు చంద్రబాబు కార్య స్థానాన్ని ఢిల్లీకి మార్చాలని ఆయన పిలుపునివ్వడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సమర్థతపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు తమ మిత్రపక్ష నేతగా ఆయన పేర్కొనడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమంలోకి చంద్రబాబు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు కార్య స్థానాన్ని ఢిల్లీకి మార్చాలని ఆయన సూచించారు. జూలు విదరచాలని కోరారు. రాహుల్ గాంధీకి అన్యాయం జరిగితే ఏపీ నుంచి అడిగే వారే లేకపోయారని వాపోయారు. ప్రజాస్వామ్యం అంటే అత్యంత గౌరవమున్న ప్రతిపక్ష నేత రాష్ట్రంలో ఉన్నారని చంద్రబాబును ఉద్దేశించి కేవీపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
రాహుల్ గాంధీకి అండగా ఉండాలని పిలుపు..
పరువు నష్టం దావా కేసులో సూరత్ న్యాయస్థానం విధించిన శిక్షకు సంబంధించి.. పార్లమెంటు నుంచి రాహుల్ గాంధీని వేటు వేయడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఒక్క పార్టీ కూడా రాహుల్ గాంధీకి అండగా మాట్లాడిన దాఖలాలు లేవు. దీనిపై మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఢిల్లీకి వచ్చి ప్రతిపక్షాలు చేస్తున్న ఉద్యమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. చిన్న చిన్న విషయాలకు వీధిన పడి కొట్టుకుంటున్న రాష్ట్ర నేతలు.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు పెట్టి బాధిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ప్రజా ప్రతినిధి ఒక్క లోక్సభ సభ్యుడు కూడా ఈ అప్రజాస్వామిక విధానాన్ని ఖండించకపోవడం దుర్మార్గమన్నారు. పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తే రాష్ట్రం నుంచి ఒక్కరూ మాట్లాడరు ఎందుకని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ మాట్లాడకపోవటానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంటే రాష్ట్రం నుంచి ఎందుకు ఎవరూ మాట్లాడరని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు పోరాటాన్ని గుర్తుచేసిన కెవిపి..
ఈ సందర్భంగా చంద్రబాబు గతంలో చేసిన పోరాటాలని కెవిపి రామచంద్రరావు గుర్తు చేశారు. 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చంద్రబాబు పోరాటం చేశారని కెవిపి పేర్కొన్నారు. 2002లో మోడీ హైదరాబాదు వస్తే అరెస్టు చేస్తానని ప్రకటించిన ధీశాలిగా పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆయన కూడా మౌనంగానే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక ప్రశ్నిస్తానని చెప్పిన జనసేనాని బిజెపి నేతలను అంతర్గతంగా అయినా ప్రశ్నించాలని సూచించారు. 2018లో చంద్రబాబు ఢిల్లీలో ప్రత్యేక హోదాపై దీక్ష చేస్తే రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 2019లో చంద్రబాబు ఓటమి తర్వాత ఆయన కించపరచోద్దని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారని కెవిపి గుర్తు చేశారు. చంద్రబాబు ఒక విధంగా తమకు మిత్రపక్షమేనని కెవిపి వ్యాఖ్యానించడం గమనార్హం. 2019లో చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తే రాహుల్, మన్మోహన్ వెళ్లి సంఘీభావం ప్రకటించారని గుర్తు చేశారు.

చంద్రబాబును కలిసేందుకు అభ్యంతరం లేదు..
రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో చంద్రబాబు కలిసి రావాలని కెవిపి ఈ సందర్భంగా కోరారు. అవసరమైతే చంద్రబాబును కలవడానికి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాత్ కలిసిన విషయాన్ని గుర్తు చేశారు. రాహుల్ అంశంతో పాటుగా పోలవరం విషయంలో అందరూ సహకారాన్ని అందించాలని కేవీపీ కోరారు. సరైన కారణానికి సంఘీభావంగా నిలవకుంటే భవిష్యత్తులో నష్టపోతారని హెచ్చరించారు. రేపటి రోజున మనల్ని పట్టించుకునే వాళ్ళు ఉండరని, రాహుల్ గాంధీకి అన్ని పార్టీలు అండగా ఉండేందుకు సిద్ధమవుతున్నాయన్నారు. ఇప్పుడు కేవీపీ చేసిన వ్యాఖ్యల పైన టిడిపి ఎలా స్పందిస్తుందో అన్నది వేచి చూడాల్సి ఉంది.