
CM Jagan- Sajjala Ramakrishna Reddy: ఏపీ సీఎం జగన్ లో స్పష్టమైన మార్పు వచ్చిందా? ఇకపై ఎవర్నీ నమ్మకూడదని భావిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఐ ప్యాక్ టీమ్ తనను గట్టెక్కించలేదన్న స్థిర నిర్ణయానికి వచ్చేశారా? సజ్జల రామక్రిష్ణారెడ్డి వంటిపై ఆధారపడితే మూల్యం తప్పదని ఆందోళనతో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నారు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ సీఎం జగన్ ఐ ప్యాక్, సజ్జల రామకృష్ణారెడ్డిపై పూర్తి స్థాయిలో ఆధారపడ్డారు. ప్రతి చిన్న విషయంపై వారి అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకున్నారు. చివరకు కేబినెట్ కూర్పులోనూ వారిదే ముద్ర . అయితే ఇప్పుడు ఐ ప్యాక్ టీమ్, సజ్జల రామక్రిష్ణారెడ్డి వ్యూహాలు ఫెయిలవుతున్నాయి. అటు మంత్రుల్లో 1పాత టీం కన్నా కొత్త టీం ఏ మాత్రం ప్రభావవంతం చూపలేకపోతోంది. అందుకే జగన్ పునరాలోచనలో పడ్డారు. సొంత నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఢిల్లీ పెద్దల సహకారంతో ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు.అందుకే ఆయన తరచూ ఢిల్లీ పర్యటనకు వెళ్తారని అంటున్నారు.
అగాధానికి వారే కారణం?
ఐ ప్యాక్ టీమ్ తో పాటు సజ్జల తనకు ఎమ్మెల్యేల మధ్య అగాధం సృష్టించారని జగన్ ఎట్టకేలకు తెలుసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో సీన్ మొత్తం అర్ధమైంది. సామాజిక సమీకరణాల పేరుతో పార్టీలో తనకు తానే చిచ్చు పెట్టుకున్నానని జగన్ గుర్తించినట్టు తెలుస్తోంది. కొడాలి నాని, పేర్ని నాని వంటి విశ్వాసపాత్రుల్ని వదులుకున్నానని అంతర్మథనం చెందుతున్నారుట. దూకుడుగా ఉండే వారిని కేబినెట్ నుంచి తప్పించి పెద్దగా నోరు తెరవని వారికి పదవులిచ్చామని తెగ బాధపడుతున్నారుట.తన కోసం నిలబడిన సీనియర్లకు పదవులివ్వడంలోనూ తప్పు జరిగిందని భావిస్తున్నారుట. ఆ తప్పులన్నీ దిద్దుకోవాలని యోచిస్తున్నట్టు సమాచారం. కొడాలి నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలతో పాటు మరికొంత మంది విధేయులకు మంత్రి పదవులు ఇవ్వాలని భావిస్తున్నారుట. అయితే పార్టీలో ధిక్కార స్వరాలు చోటుచేసుకుంటున్న తరుణంలో మరోసారి తేనెతుట్ట కదిలించడానికి సీఎం భయపడుతున్నట్టు తెలుస్తోంది.
ఆ వర్గాలను దూరం చేసుకున్న జగన్…
వైసీపీ వరుస పరాజయాలు సీఎం జగన్ స్వయంకృతాపం వల్ల జరిగినవే. గత ఎన్నికల్లో చాలా వర్గాలు తనకు అండగా నిలిచాయి. కానీ వారెవరికీ న్యాయం చేయలేదు. వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లు వేయరన్న ఉద్దేశంతో వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, క్షత్రియ సహా పలు వర్గాల వారిని జగన్ ఏరికోరి దూరం చేసుకున్నారు. ఆయా వర్గాల కోటాలో ఇచ్చిన మంత్రి పదవులను సైతం తొలగించారు. దీంతో ఆయా వర్గాలు పూర్తగా దూరమయ్యాయి. పోనీ అదే సమయంలో తాను ప్రాధాన్యం ఇచ్చిన వర్గాలు అండగా నిలిచాయంటే అదీ లేదు. ఇదంతా వ్యూహాత్మక తప్నిదమేనని జగన్ భావిస్తున్నారు. ముందుగా తనపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను కూల్ చేయాలని భావిస్తున్నారు. వాటిని సరిదిద్దుకునే ఎన్నికలకు వెళతారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ముందస్తుకు ప్రయత్నాలు…
వైసీపీకి ప్రతికూల పరిస్థితులు ఉన్న ప్రస్తుత సమయంలో సీఎం జగన్ కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని గట్టిగా భావిస్తున్నారు. తెలంగాణతో పాటే ఏపీలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలకు సైతం విన్నవించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ తనను గట్టెక్కించగలదని జగన్ నమ్ముతున్నట్టు తెలుస్తోంది. అందుకే వీలైనంతవరకూ రాజకీయంగా బీజేపీ సహకారం తీసుకోవాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. తరచూ ఢిల్లీ పర్యటనలు అందులో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తన సొంత నిర్ణయాలతో పాటు బీజేపీ సహకారంతో ముందుకెళ్లడమే జగన్ లక్ష్యంగా మారిందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.