https://oktelugu.com/

Panjagutta: చివరికి శ్మశానాన్ని కూడా వదిలిపెట్టడం లేదు.. శవాలు కాలుతుంటే అదేం పని రా బాబూ?!

అది హైదరాబాద్ మహానగరం.. అందులో పంజాగుట్ట శ్మశానం.. ఓవైపు శవాలు కాలుతున్నాయి.. మరోవైపు అంత్యక్రియలు జరుగుతున్నాయి.. 365 రోజులు అక్కడ జరిగేది ఇదే. కానీ అలాంటి చోట కూడా కొంతమంది యువకులు పాడు పనికి తెగించారు. జనం చూస్తున్నారనే సోయి కూడా లేకుండా విచ్చలవిడిగా చేశారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 13, 2024 / 06:06 PM IST

    Panjagutta

    Follow us on

    Panjagutta: రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. స్టేట్ నార్కోటిక్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు వాడకుండా కట్టడి చేస్తోంది. అంతేకాదు ఇష్టానుసారంగా మాదకద్రవ్యాలు అమ్మే వారిపై దృష్టి సారించింది. గతంలో మాదకద్రవ్యాలు అమ్మి.. పోలీసులకు చిక్కిన వారిపై ప్రత్యేకంగా నిఘా పెడుతోంది. రాష్ట్రంలో ఎక్కడైనా మాదకద్రవ్యాల ఆనవాళ్లు కనిపిస్తే పాత నేరస్తులను కూడా విచారిస్తోంది. ఇంత చేస్తున్నప్పటికీ మాదక ద్రవ్యాల రవాణా ఆగడం లేదు. పోలీసులు ఎక్కడికి అక్కడ తనిఖీలు చేస్తున్నప్పటికీ దొడ్డిదారిన మాదక ద్రవ్యాల రవాణా జరుగుతూనే ఉంది. దానికి సాక్ష్యమే ఈ ఉదంతం. ఇది పంజాగుట్టలోని స్మశాన వాటికలో చోటుచేసుకుంది.

    దర్జాగా గంజాయి తాగారు

    పంజాగుట్ట శ్మశాన వాటికలో విపరీతమైన రద్దీ ఉంటుంది. అయితే ఇక్కడ పోలీసుల చెకింగ్ ఉండదని భావించి.. ఇతర విద్యార్థులు అక్కడికి వచ్చారు. వారి వయసు పాతిక సంవత్సరాల లోపే ఉంటుంది. వారు అక్కడికి వచ్చి చలువరాతి సమాధి మీద కూర్చున్నారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న సిగరెట్లలో పొగాకు పొడిని తొలగించారు. అందులో గంజాయి చూర్ణాన్ని నింపారు. ఆ తర్వాత చెరొక సిగరెట్ వెలిగించుకున్నారు. ఆ సమాధినే పూల పాన్పు అనుకొని భావించి గంజాయి పీల్చడం ప్రారంభించారు. అప్పటికి సమయం ఉదయం 9:00 గంటలే అవుతోంది. అయినప్పటికీ కాలేజీకి వెళ్లకుండా వారు గంజాయి పీల్చడానికే సమయాన్ని వెచ్చించారు. గంజాయి తాగిన అనంతరం అక్కడే చాలాసేపు ఉన్నారు. అందులో ఒక యువకుడు సమాధి మీద పడుకుని ఉండగా.. మరొక యువకుడు మైకంలో తేలిపోయాడు. అయితే ఈ దృశ్యాలను ఆ పక్కనే ఉన్న కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులు చూశారు.. ఇంత ఉదయాన్నే విద్యార్థులు శ్మశానానికి ఎందుకు వచ్చారా? అని ఆశ్చర్యపోయిన వారు.. ఆ తర్వాత వారు చేస్తున్న దారుణాన్ని చూసి హతాశులయ్యారు. అనంతరం తమ ఫోన్లలో వారి నిర్వాకాన్ని బంధించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. అయితే ఆ విద్యార్థులకు గంజాయి ఎలా లభించిందనేది అంతు పట్టడం లేదు. మాదకద్రవ్యాలకు ఆస్కారం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే ప్రకటించినప్పటికీ.. ఇలాంటి ఉదంతాలు జరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారడంతో ఆ విద్యార్థులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? వారు గంజాయి ఎలా తాగారు? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.