Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు భవిష్యత్ మొబిలిటీగా పరిగణించబడుతున్నాయి. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. కార్ల కంపెనీలతో పాటు, ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ కారు లేదా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంతో సహా గ్రీన్ మీడియం రవాణాపై దృష్టి పెడుతున్నాయి. ప్రజలు ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి వెనుకాడడం వెనుక అనేక ఆందోళనలు ఉన్నాయి. ఎలక్ట్రిక్ కార్లు పర్యావరణానికి మంచి ఎంపిక. పెట్రోల్ లేదా డీజిల్ కార్ల కంటే తక్కువ ధర కలిగి ఉన్నప్పటికీ ఇవి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ వాహనాలను కొనే ముందు వీటిని దృష్టిలో పెట్టుకోవాలి.
1. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు
ప్రస్తుతం భారతదేశంలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య తక్కువగా ఉంది. ముఖ్యంగా మెట్రోలు లేదా చిన్న పట్టణాల నుండి బయటికి వెళ్లినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలంటే చిన్న పాటి యుద్ధమే చేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, ఎలక్ట్రిక్ కార్లతో ఎక్కువ దూరం ప్రయాణించడం కష్టం, ఎందుకంటే ఛార్జింగ్ పాయింట్‌ను కనుగొనడం చాలా కష్టమైన పని. ఛార్జింగ్ కూడా చాలా సమయం పడుతుంది, ఇది సమయం తక్కువగా ఉన్న వ్యక్తులకు పెద్ద సమస్యగా తయారవుతుంది.
2. బ్యాటరీ ధర, పరిధి
ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలు ఖరీదైనవి. కారు మొత్తం ధరలో ఎక్కువ భాగాన్ని బ్యాటరీలే కలిగి ఉంటాయి. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లోని బ్యాటరీలు 7-8 ఏళ్లు మాత్రమే పని చేస్తాయి. బ్యాటరీలు కూడా పరిమిత పరిధిని కలిగి ఉంటాయి. అంటే మీరు ఒకే ఛార్జ్‌తో తక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. చల్లని వాతావరణంలో బ్యాటరీ పరిధి మరింత తగ్గుతుంది.
3. నిర్వహణ
ఎలక్ట్రిక్ కార్లకు సాధారణ కార్ల కంటే తక్కువ నిర్వహణ అవసరం. కానీ బ్యాటరీని మార్చడం చాలా ఖరీదైనది, ప్రత్యేకించి అది వారంటీలో లేకుంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది.
4. పర్యావరణంపై ప్రభావం
విద్యుత్ వాహనాలు పూర్తిగా ఎకో-ఫ్రెండ్లీ కావు. ఎలక్ట్రిక్ కార్లు కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేయనప్పటికీ, బ్యాటరీల తయారీ, పారవేయడం పర్యావరణానికి హానీ కలుగ జేస్తాయి. ఛార్జింగ్ స్టేషన్లకు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి డీజిల్ జనరేటర్లను ఉపయోగిస్తారు. విద్యుత్ వాహనాలలో ఉండే బ్యాటరీలు పాడైన తర్వాత వాటిని రీసైకిల్ చేయడం కష్టతరం. ఈ బ్యాటరీలు ఎలక్ట్రానిక్ వేస్ట్‌గా మారి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి.
5. భద్రతా సమస్య
ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్య భద్రత కూడా. ఎలక్ట్రిక్ కార్లు వెంటనే మంటలకు గురవుతాయి. ముఖ్యంగా బ్యాటరీ చెడిపోయినట్లయితే త్వరగా మంటలకు లోనవుతాయి. అన్ని భద్రతా జాగ్రత్తలను పాటించడం , జరిగే ప్రమాదాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే, భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లలో అగ్ని ప్రమాదాలు చాలా తక్కువ. మొత్తంమీద, ఎలక్ట్రిక్ కార్లు ఆకర్షణీయమైన ఎంపిక అని చెప్పవచ్చు, అయితే కొన్ని సవాళ్లను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వారు కూడా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తారు.
6. తగ్గుతున్న ప్రభుత్వ ప్రోత్సాహకాలు
ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుదారులకు సబ్సిడీలు ఇస్తున్నాయి. కానీ, వీటి ధరలు ఇప్పటికీ పెట్రోల్ వెహికల్స్ కంటే ఎక్కువగానే ఉంటున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వాల సబ్సిడీలు తగ్గితే విద్యుత్ వాహనాలు మరింత ఖరీదుగా మారుతాయి. అంతేకాకుండా, విద్యుత్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఇంకా మన దేశంలో పూర్తిగా అభివృద్ధి చెందలేదు.